Nissan NX8 : వండర్ కార్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే నెలంతా తిరగొచ్చు.. నిస్సాన్ సరికొత్త ఆవిష్కరణ
నిస్సాన్ సరికొత్త ఆవిష్కరణ
Nissan NX8 : జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. చైనా మార్కెట్ లక్ష్యంగా తన ప్రీమియం ఎస్‌యూవీ NX8ను ఆవిష్కరించింది. కేవలం 12 నిమిషాల్లో ఛార్జ్ అవ్వడమే కాకుండా, పెట్రోల్, బ్యాటరీ కలయికతో ఏకంగా 1,450 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ కారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నిస్సాన్ N సీరీస్ లో భాగంగా వచ్చిన ఈ కారు అద్భుతమైన టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్ల కలబోతగా కనిపిస్తోంది.
నిస్సాన్ NX8 లో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లను కంపెనీ అందించింది. మొదటిది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్ (BEV), రెండోది ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EREV). ఈ EREV వెర్షన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఒక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కానీ ఇది నేరుగా చక్రాలను తిప్పదు, కేవలం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి జనరేటర్ లాగా పనిచేస్తుంది. దీనివల్ల కారు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 310 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెట్రోల్, బ్యాటరీ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 1,450 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ ధృవీకరించింది.
నిస్సాన్ NX8 డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. దీని పొడవు 4,870 mm ఉండటం వల్ల కారు లోపల చాలా విశాలంగా ఉంటుంది. నిస్సాన్ కొత్త V-మోషన్ డిజైన్ లాంగ్వేజ్‌ను ఇందులో ఉపయోగించారు. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, నిలువుగా ఉండే హెడ్ లాంప్స్, కారు వెడల్పు అంతా విస్తరించి ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (DRLs) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా దీని బాడీని డిజైన్ చేశారు, దీనివల్ల వేగం పెరగడమే కాకుండా మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది.
కారు లోపలికి అడుగుపెడితే ఏదో స్పేస్ షిప్ లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో రెండు భారీ 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లు ఉన్నాయి. ఇవి అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8295P చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. అంటే మొబైల్ ఫోన్ కంటే స్పీడ్ గా టచ్ స్క్రీన్ రెస్పాన్స్ ఉంటుంది. సేఫ్టీ కోసం మోమెంటా సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను ఇందులో పొందుపరిచారు. ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఛార్జింగ్ సమస్యను నిస్సాన్ పూర్తిగా తొలగించింది. ఈ కారు 463 kW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కారు బ్యాటరీని కేవలం 12 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు నింపవచ్చు. బీఈవీ (BEV) వెర్షన్ లో 81 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 650 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇప్పటికే బీఈవీ వెర్షన్ డెలివరీలు ప్రారంభం కాగా, ఈఆర్ఈవీ (EREV) వెర్షన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. భారత మార్కెట్లోకి ఇది వస్తే మాత్రం హైబ్రిడ్ కార్ల విభాగంలో పెను మార్పులు రావడం ఖాయం.