Nissan Tekton : క్రెటా, సెల్టోస్ కార్లకు గట్టి పోటీ.. భారత మార్కెట్లోని జూలై 9న నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ

భారత మార్కెట్లోని జూలై 9న నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ

Update: 2026-06-19 15:22 GMT

Nissan Tekton : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీల మార్కెట్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈ విభాగంలో తన పట్టును బలపరుచుకోవడానికి జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్, తన సరికొత్త మోడల్ నిస్సాన్ టెక్టాన్‎ను తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను కంపెనీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జూలై 9, 2026న ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ అధికారికంగా ఇండియాలో అరంగేట్రం చేయనుంది. నిస్సాన్ బ్రాండ్ కు భారత మార్కెట్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ లాంచ్ కాబోతోంది.

నిస్సాన్ పెట్రోల్ ప్రేరణతో బేబీ పెట్రోల్

ఈ కొత్త కారుకు సంబంధించి ఆటోమొబైల్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నిస్సాన్ కంపెనీ ఈ టెక్టాన్ ఎస్‌యూవీని ముద్దుగా బేబీ పెట్రోల్ అని పిలుస్తోంది. ఎందుకంటే, అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పటిష్టమైన, లగ్జరీ, ఆఫ్-రోడింగ్ కారుగా గుర్తింపు తెచ్చుకున్న నిస్సాన్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ నిస్సాన్ పెట్రోల్ డిజైన్ ఆధారంగా ఈ టెక్టాన్ ను రూపొందించారు. నిస్సాన్ పెట్రోల్ లాగే ఇది కూడా చూడటానికి ఎంతో దృఢంగా, బాక్సీ షేప్ లో, రగ్గడ్ లుక్ తో వినియోగదారులను ఆకట్టుకోనుంది.

రోడ్డుపై తిరుగులేని అగ్రెసివ్ డిజైన్

కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ప్రకారం.. నిస్సాన్ టెక్టాన్ ఫ్రంట్ డిజైన్ ఎంతో అగ్రెసివ్ గా ఉంది. కారు ముందు భాగంలో పెద్ద సైజులో ఉండే బోల్డ్ గ్రిల్ ను ఇచ్చారు, దీని మధ్యలో ఒక స్పెషల్ రెడ్ కలర్ స్ట్రిప్, మెరిసిపోయే నిస్సాన్ లోగోను అమర్చారు. కారు మొత్తం వెడల్పుగా విస్తరించి ఉండే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లు, ఎల్-షేప్ లైటింగ్ ఎలిమెంట్స్, స్టైలిష్ హెడ్‌లాంప్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. బోనెట్ పై బలమైన లైన్లు,పెద్ద అక్షరాలతో రాసిన TEKTON అనే పేరు కారు గంభీరత్వాన్ని మరింత పెంచింది. వీటితో పాటు రూఫ్ రెయిల్స్, పెద్ద స్కిడ్ ప్లేట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ , వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఉండనున్నాయి.

ఇంటీరియర్ లో సరికొత్త ఏఐ, అడాస్ టెక్నాలజీ

కారు లోపలి భాగం కూడా అంతే లగ్జరీగా, ఫీచర్ లోడెడ్ గా ఉండబోతోంది. నివేదికల ప్రకారం.. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వేసవిలో హాయిగా ప్రయాణించడానికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కారును సులభంగా పార్క్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రయాణీకుల భద్రత కోసం ఇందులో లెవెల్-2 అడాస్ టెక్నాలజీని అందించబోతున్నారు. ఇది ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్ ని అలర్ట్ చేస్తుంది.

రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్.. పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు

సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ఈ కొత్త నిస్సాన్ టెక్టాన్ కారును ఇటీవల మార్కెట్లోకి వచ్చిన సరికొత్త రెనాల్ట్ డస్టర్ తయారు చేసిన ప్లాట్‌ఫారమ్‌పైనే అభివృద్ధి చేసినట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీలో కస్టమర్ల ఛాయిస్ కోసం మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. అందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, భవిష్యత్తులో మైలేజ్ మైండ్ బ్లోయింగ్ గా ఇచ్చేలా 1.8-లీటర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉండనున్నాయి. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) ట్రాన్స్‌మిషన్లు లభించనున్నాయి.

ధర ఎంత ఉండొచ్చు? పోటీ ఎవరితో?

భారతదేశంలో విపరీతంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ టెక్టాన్ ఒక తిరుగులేని పవర్‌ఫుల్ ప్లేయర్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ గనుక ఈ కారును సరైన ఫీచర్లు, రీజనబుల్ ధరతో మార్కెట్లోకి తీసుకువస్తే.. ప్రస్తుతం మార్కెట్ ని శాసిస్తున్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, త్వరలో రాబోతున్న టాటా సియెర్రా కార్లకు భారీ ముప్పు తప్పదని చెప్పవచ్చు.

Tags:    

Similar News