Nissan Tekton : నిస్సాన్ టెక్టాన్ బుకింగ్స్ షురూ.. ఆన్‌లైన్, షోరూమ్‌లలో బుక్ చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే

సింపుల్ ప్రాసెస్ ఇదే

Update: 2026-07-10 10:52 GMT

Nissan Tekton : ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ టెక్టాన్‎ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. విస్రాంత ప్రయాణాలకు, అడ్వెంచర్ ట్రిప్పులకు సరిపోయేలా రూపొందించిన ఈ కారు ప్రారంభ ధరను రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ సరికొత్త మోడల్‌ను కంపెనీ మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. నిస్సాన్ గ్లోబల్ మోడల్ అయిన నిస్సాన్ పెట్రోల్ డిజైన్ స్ఫూర్తితో దీనిని మరింత స్టైలిష్‌గా, దృఢంగా తీర్చిదిద్దారు. టాల్-బాయ్ స్టాన్స్, కనెక్టెడ్ హెడ్‌ల్యాంప్స్,టెయిల్‌ల్యాంప్స్ సెటప్‌తో ఈ కారు మొదటి చూపులోనే ఎస్‌యూవీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

కొత్త నిస్సాన్ టెక్టాన్ కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించింది. నిస్సాన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఇంట్లోనే కూర్చుని ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసి టెక్టాన్ మోడల్‌ను ఎంచుకున్నాక, మీ ఇష్టానికి అనుగుణంగా వేరియంట్, ఇంజన్ ఆప్షన్, కలర్‌ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్ ఎంటర్ చేసి, మీకు నచ్చిన డీలర్‌షిప్‌ను ఎంచుకుని నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్ ఇబ్బంది అనుకుంటే, నేరుగా సమీపంలోని నిస్సాన్ షోరూమ్‌కు వెళ్లి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సహాయంతో పూర్తి వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చు.

ఈ కారు డెలివరీల కోసం కస్టమర్లు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఈ నెల 20వ తేదీ నుంచే దేశవ్యాప్తంగా నిస్సాన్ టెక్టాన్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే వేరియంట్ల లభ్యత, మీ ప్రాంతంలోని డీలర్‌షిప్ ఆధారంగా డెలివరీ సమయం మారుతుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో రెనో డస్టర్ తరహా బాడీ షేప్, 18-ఇంచ్ వీల్స్, ప్రీమియం అప్హోల్స్టరీ అందించారు. ఇంటీరియర్‌లో 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అత్యాధునిక హంగులు ఉన్నాయి.

ప్రయాణికుల రక్షణ కోసం ఈ కారులో భద్రతా ప్రమాణాలను చాలా పటిష్టంగా ఉంచారు. నిస్సాన్ టెక్టాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, అత్యంత సురక్షితమైన లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్లు ఇచ్చారు. ఇంజన్ పరంగా ఇందులో రెండు టర్బో-పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 PS పవర్, 166 Nm టార్క్ అందిస్తూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే, పవర్‌ఫుల్ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 163 PS పవర్, 280 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టాటా కర్వ్ వంటి గట్టి పోటీదారులను ఢీకొట్టనుంది.

Tags:    

Similar News