Nissan Tekton vs MG Astor: ఫ్యామిలీతో హ్యాపీగా జర్నీ చేయాలా? నిస్సాన్ టెక్టాన్ vs ఎంజీ ఆస్టర్.. ఏది బెస్ట్ ?

ఏది బెస్ట్ ?

Update: 2026-07-16 11:33 GMT

Nissan Tekton vs MG Astor: భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు తమ మొదటి సొంత కారుగా లేదా అప్‌గ్రేడ్ కారుగా ఒక మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. ఈ విభాగంలో గ్లోబల్ బ్రాండ్ నిస్సాన్ తన సరికొత్త పవర్‌ఫుల్ మోడల్ టెక్టాన్‎ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది నిస్సాన్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ పెట్రోల్ డిజైన్ స్ఫూర్తితో రూపుదిద్దుకుంది. మరోవైపు, మార్కెట్లో ఇప్పటికే ప్రీమియం ఇంటీరియర్స్, బడ్జెట్ ధరతో ఫ్యామిలీ కారుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంజీ ఆస్టర్ ఉంది. ఈ రెండింటిలో ఏ కారు మధ్యతరగతి కుటుంబాల అవసరాలకు పక్కాగా సరిపోతుందో చూద్దాం.

బడ్జెట్ పరిమితులు ఉండే మధ్యతరగతి వారికి ధర అనేది అత్యంత కీలకమైన అంశం. ధర పరంగా చూస్తే ఎంజీ ఆస్టర్ కస్టమర్ల జేబుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంజీ ఆస్టర్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షల నుంచి మొదలవుతుంది. అదే సమయంలో నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ధర రూ. 10.49 లక్షలుగా ఉంది. అంటే ఆస్టర్ ప్రారంభ ధర టెక్టాన్ కంటే దాదాపు రూ. 70,000 తక్కువగా ఉంటుంది. ఇక టాప్-ఎండ్ మోడల్స్ విషయానికి వస్తే, నిస్సాన్ టెక్టాన్ ధర రూ. 18.59 లక్షలుగా ఉండగా, ఎంజీ ఆస్టర్ గరిష్ట ధర రూ. 15.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. అంటే టాప్ మోడల్‌లో టెక్టాన్ ధర ఏకంగా రూ. 3.29 లక్షలు ఎక్కువగా ఉంది.

నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబంతో కలిసి లాంగ్ జర్నీలు లేదా వీకెండ్ ట్రిప్స్ వెళ్లే వారికి కారు లోపల స్థలం చాలా అవసరం. ఇక్కడే నిస్సాన్ టెక్టాన్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎంజీ ఆస్టర్‌తో పోలిస్తే టెక్టాన్ పొడవులో 26 మిమీ, వెడల్పులో 6 మిమీ, ఎత్తులో 24 మిమీ పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా దీని వీల్‌బేస్ ఆస్టర్ కంటే 72 మిమీ ఎక్కువగా ఉండటం వల్ల వెనుక సీటులో కూర్చునే వారికి అద్భుతమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తుంది. అంతేకాకుండా టెక్టాన్ బూట్ స్పేస్ ఆస్టర్ కంటే 30 లీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ లగేజ్ సంచులు పెట్టుకోవడానికి వీలవుతుంది. అయితే, సిటీ ట్రాఫిక్‌లో ప్రతిరోజూ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి కొలతల్లో కాస్త చిన్నగా ఉండే ఎంజీ ఆస్టర్ చాలా సులభంగా హ్యాండిల్ చేయడానికి వీలుపడుతుంది.

ఇంజన్ సామర్థ్యం, పవర్ విషయానికి వస్తే నిస్సాన్ టెక్టాన్ పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. టెక్టాన్‌లో రెండు రకాల టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని 1.0-లీటర్ టర్బో ఇంజన్ 100 PS పవర్‌ను అందిస్తుంది (ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది). ఇక దీని 1.3-లీటర్ పవర్‌ఫుల్ టర్బో ఇంజన్ ఏకంగా 163 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది, ఇందులో మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మరోవైపు ఎంజీ ఆస్టర్ కేవలం ఒకే ఒక 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 110 PS పవర్ మాత్రమే ఇస్తుంది. టెక్టాన్ 1.3-లీటర్ ఇంజన్‌తో పోలిస్తే ఆస్టర్ పవర్ 53 PS తక్కువగా ఉంటుంది. హైవేలపై వేగంగా దూసుకెళ్లాలనుకునే వారికి టెక్టాన్ ఇంజన్ సూపర్ ఛాయిస్ అవుతుంది.

ఫీచర్ల పరంగా రెండు ఎస్‌యూవీలు కూడా ఆధునిక టెక్నాలజీతో లగ్జరీ అనుభూతిని ఇస్తాయి. రెండు కార్లలోనూ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే నిస్సాన్ టెక్టాన్ మరికొన్ని లగ్జరీ ఫీచర్లతో ముందుంటుంది. టెక్టాన్‌లో 10.25-ఇంచుల భారీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉండగా, ఆస్టర్‌లో 7-ఇంచుల డిస్‌ప్లే మాత్రమే ఉంటుంది. అలాగే టెక్టాన్‌లో మాత్రమే లభించే ప్యాడల్ షిఫ్టర్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆటోమేటిక్ పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద 18-ఇంచుల అలాయ్ వీల్స్ దీనిని మరింత ప్రీమియంగా మారుస్తాయి. సేఫ్టీ కోసం టెక్టాన్‌లో ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు లభిస్తుండగా, ఆస్టర్‌లో కేవలం ముందు వైపు మాత్రమే సెన్సార్లు ఉన్నాయి.

ధర తక్కువలో ప్రాక్టికల్ కారు కావాలనుకుంటే ఎంజీ ఆస్టర్ సరిపోతుంది. కానీ ఎక్కువ స్పేస్, శక్తివంతమైన ఇంజన్, లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి నిస్సాన్ టెక్టాన్ మంచి ఎంపిక అవుతుంది.

Tags:    

Similar News