Tekton vs Taigun : నిస్సాన్ టెక్టాన్ vs ఫోక్స్‌వ్యాగన్ టైగూన్.. మైలేజ్, పవర్‌లో దేనిది పైచేయి?
మైలేజ్, పవర్‌లో దేనిది పైచేయి?
Tekton vs Taigun : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు విలాసవంతమైన ప్రయాణంతో పాటు బడ్జెట్ పరిధిలో ఉండే కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విభాగంలో నిస్సాన్ సంస్థ సరికొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన టెక్టాన్, ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బోల్డ్ లుక్, అత్యాధునిక ఫీచర్లు, విభిన్న ఇంజన్ ఆప్షన్లతో వచ్చిన ఈ రెండు కార్లలో మధ్యతరగతి కొనుగోలుదారులకు ఏది బెస్ట్ ఛాయిస్ అనేది చూద్దాం.
కారు ధర విషయానికి వస్తే నిస్సాన్ టెక్టాన్ కస్టమర్ల జేబుకు కాస్త ఉపశమనం కలిగిస్తుందనే చెప్పాలి. దీని ప్రారంభ ధర రూ.10.49 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ ధర రూ.18.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అదే సమయంలో సరికొత్త అప్‌డేట్లతో వచ్చిన 2026 ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ప్రారంభ ధర రూ. 11 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ.19.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు పలుకుతోంది. బేస్ మోడల్స్ మధ్య దాదాపు రూ.50,000, టాప్ మోడల్స్ ధరల్లో దాదాపు రూ.1 లక్ష వరకు వ్యత్యాసం ఉంది. బడ్జెట్ పరిమితులు ఉండే మధ్యతరగతి వారికి నిస్సాన్ టెక్టాన్ మంచి ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది.
రోడ్డుపై వెళ్లేటప్పుడు పెద్ద కారులా కనిపించడంలో నిస్సాన్ టెక్టాన్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. టైగూన్‌తో పోలిస్తే టెక్టాన్ దాదాపు అన్ని కొలతలలో పెద్దదిగా ఉంటుంది. ఇది పొడవులో 127 మిమీ, వెడల్పులో 55 మిమీ, ఎత్తులో 62 మిమీ అదనంగా ఉంటుంది. అలాగే దీని వీల్‌బేస్ కూడా టైగూన్ కంటే 6 మిమీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు లోపల కూర్చునే వారికి మంచి హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ లభించడమే కాకుండా, కారు చూడటానికి చాలా గంభీరంగా, రోడ్డుపై బలమైన ఉనికిని చాటుకునేలా కనిపిస్తుంది.
ఇంజన్ సామర్థ్యం విషయానికి వస్తే రెండు కార్లు కూడా టర్బో-పెట్రోల్ ఆప్షన్లతో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. నిస్సాన్ టెక్టాన్‌లో బేస్ వేరియంట్ కోసం 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 PS పవర్ / 166 Nm టార్క్) ఉంది. అదేవిధంగా, మరింత వేగాన్ని కోరుకునే వారి కోసం సరికొత్త 1.3-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బో ఇంజన్‌ను అందించారు. ఇది ఏకంగా 163 PS పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
మరోవైపు, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ కూడా రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. దీని 1.0-లీటర్ బేస్ ఇంజన్ 115 PS పవర్, 178 Nm టార్క్ ఇస్తుంది. ఇక దీని రెండవ ఆప్షన్ అయిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 PS పవర్, 250 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. పవర్ పరంగా చూస్తే నిస్సాన్ టెక్టాన్ 1.3-లీటర్ ఇంజన్ ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ కంటే ఎక్కువ హార్స్‌పవర్‌ను అందిస్తూ డ్రైవింగ్‌ను మరింత ఉత్సాహభరితంగా మారుస్తుంది.
ఫీచర్ల పరంగా నిస్సాన్ టెక్టాన్ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటుంది. టైగూన్‌లో లేని కొన్ని ప్రీమియం ఫీచర్లు టెక్టాన్‌లో లభిస్తాయి. ఇందులో 18-ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్, గూగుల్ బిల్ట్-ఇన్ సపోర్ట్, సరికొత్త లెవెల్-2 ఎడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు రెండు కార్లలోనూ కామన్‌గా లభిస్తాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ESC), టైర్ ప్రెజర్ మానిటర్ వంటి ఫీచర్లు రెండింటిలోనూ ప్రామాణికంగా ఉన్నాయి. కానీ నిస్సాన్ టెక్టాన్‌లోని 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి.