Number Plate Cloning : నంబర్ ప్లేట్ క్లోనింగ్ ముఠా జాగ్రత్త.. తప్పు ఎవరో చేస్తే.. చలాన్ మీ ఫోన్‌కు వస్తుందా?
తప్పు ఎవరో చేస్తే.. చలాన్ మీ ఫోన్‌కు వస్తుందా?
Number Plate Cloning : ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి కూడా ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. మనం ఇంట్లోనే ప్రశాంతంగా ఉన్నా.. మన ఫోన్‌కు మాత్రం ట్రాఫిక్ చలాన్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇదేదో పొరపాటున జరిగిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం నగరాల్లో నంబర్ ప్లేట్ క్లోనింగ్ అనే కొత్త రకమైన నేరం విపరీతంగా పెరిగిపోతోంది. వేరే ఎవరో చేసిన తప్పులకు, అమాయకులైన వాహన యజమానులు భారీగా జరిమానాలు కట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ తరహా కేసులు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.
అసలు ఈ క్లోనింగ్ మోసం ఎలా జరుగుతుంది?
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు లేదా జంక్షన్లలో ఉండే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు కేవలం వాహనం నంబర్‌ను మాత్రమే స్కాన్ చేస్తాయి. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు కేటుగాళ్లు, తమ బండికి ఉన్న ఒరిజినల్ నంబర్ ప్లేట్‌ను తీసేసి, వేరే వాహనం నంబర్‌తో ఉన్న డూప్లికేట్ ప్లేట్‌ను తగిలిస్తున్నారు. దీనివల్ల వారు ఎన్ని సిగ్నల్ జంప్‌లు చేసినా, హెల్మెట్ లేకుండా తిరిగినా ఆ చలాన్ నేరుగా అసలైన నంబర్ ఉన్న యజమాని అడ్రస్‌కు వెళ్తుంది. ఇలా నేరం ఒకరు చేస్తే.. శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు.
హైదరాబాద్‌లో వెలుగుచూసిన షాకింగ్ కేసులు:
హైదరాబాద్ పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో చలాన్లు వచ్చాయి. కానీ అతను ఆ ప్రాంతానికి అసలు వెళ్లనే లేదు. తీరా ఆరా తీస్తే.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఈ వ్యక్తి నంబర్‌ను వాడుతున్నట్లు తేలింది. అలాగే మరో కేసులో ఒక మహిళ ఇంటి నుంచి బయటకు రాకపోయినా ఆమెకు మెసేజ్‌లు వచ్చాయి. సీసీ కెమెరాల పుటేజీని నిశితంగా పరిశీలించగా, నిందితుడు తన నంబర్‌లోని ఒక అంకెను కొంచెం మార్చి (ఉదాహరణకు 3ని 8గా మార్చడం) మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఏడాదిలోనే వేల సంఖ్యలో తప్పుడు చలాన్లు
గణాంకాల ప్రకారం.. 2025 మొదటి 10 నెలల్లోనే ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 36,000 కంటే ఎక్కువ తప్పుడు చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో సగానికి పైగా నంబర్ ప్లేట్ మార్పులు లేదా క్లోనింగ్ వల్ల జరిగినవే అని సమాచారం. కెమెరాలు కేవలం నంబర్‌ను చూస్తాయి తప్ప, ఆ బండి రంగు లేదా మోడల్‌ను యజమాని వివరాలతో వెంటనే సరిపోల్చలేవు. దీనిని నిందితులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఈ మోసం నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
ఒకవేళ మీకు రాకూడని చలాన్ ఏదైనా వస్తే, వెంటనే అప్రమత్తం అవ్వండి.
* వివరాలు సరిపోల్చండి: చలాన్ ఫోటోలో ఉన్న వాహనం మీదేనా? రంగు, మోడల్ ఒకటేనా? అనేది ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.
* పోలీసులకు ఫిర్యాదు: మీకు సంబంధం లేని చలాన్ వస్తే వెంటనే దగ్గరలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయండి.
* ఫోటో సాక్ష్యం: చలాన్ పడిన సమయంలో మీ వాహనం ఎక్కడ ఉందో నిరూపించే సీసీ టీవీ పుటేజీ లేదా ఆఫీసు/ఇంటి పార్కింగ్ వివరాలను సాక్ష్యంగా ఉంచండి.
నంబర్ ప్లేట్ మార్చడం లేదా ఫోర్జరీ చేయడం అనేది సెక్షన్ 420 కింద తీవ్రమైన నేరం. పోలీసులు ఇప్పుడు కెమెరా డేటాను వాహన రిజిస్ట్రేషన్ డేటాతో లింక్ చేసి, ఇలాంటి నకిలీ ప్లేట్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.