Renault Duster : డస్టర్ ఈజ్ బ్యాక్.. భారత్ ఎన్‌క్యాప్ టెస్టులో డస్టర్‌కు 5-స్టార్ రేటింగ్.. ఫుల్ సేఫ్ గురూ
భారత్ ఎన్‌క్యాప్ టెస్టులో డస్టర్‌కు 5-స్టార్ రేటింగ్.. ఫుల్ సేఫ్ గురూ
Renault Duster : భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త అవతారంలో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కొత్త తరం డస్టర్, రాగానే తన సత్తా చాటింది. తాజాగా జరిగిన భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో ఈ ఎస్‌యూవీ ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుని, ప్రయాణీకుల భద్రతలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కొత్త తరం రెనాల్ట్ డస్టర్ భారత సేఫ్టీ టెస్టింగ్ ఏజెన్సీ అయిన భారత్ ఎన్‌క్యాప్ నుంచి అత్యున్నతమైన 5-స్టార్ రేటింగ్‌ను అందుకుంది. పెద్దల రక్షణ, పిల్లల రక్షణ అనే రెండు విభాగాల్లోనూ ఈ ఎస్‌యూవీ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఫ్రంట్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు డ్రైవర్ తల, మెడ, తొడ భాగాలు చాలా సురక్షితంగా ఉన్నట్లు తేలింది. ఛాతీ, కాళ్ల రక్షణ కూడా సంతృప్తికరంగా ఉండటంతో ఈ రేటింగ్ దక్కింది.
డస్టర్ ఈసారి పిల్లల సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనికి సంబంధించి 49 పాయింట్లకు గాను 45 పాయింట్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 18 నెలల నుండి 3 ఏళ్ల వయస్సు గల పిల్లల డమ్మీలతో చేసిన టెస్టుల్లో, ప్రమాదం జరిగినప్పుడు వారికి ఎటువంటి గాయాలు కాకుండా గరిష్ట రక్షణ లభించింది. ఇందులో ఉన్న ISOFIX సిస్టమ్, రియర్ ఫేసింగ్ చైల్డ్ సీట్ సౌకర్యం పిల్లల భద్రతను మరింత పెంచాయి.
కేవలం బాడీ మాత్రమే కాదు, లోపల ఉన్న టెక్నాలజీ కూడా డస్టర్‌ను అత్యంత సురక్షితమైన కారుగా మార్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఏబీఎస్ విత్ ఈబీడీ, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు లెవల్-2 ఏడీఏఎస్ (ADAS) ఫీచర్లు ఉండటం వల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలను ముందుగానే గుర్తించి అలర్ట్ చేస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి దీనికి అదనపు బలం.
రెనో డస్టర్ తన ప్రత్యర్థులైన మారుతి విక్టోరియాస్, టాటా సియెర్రా, కియా సెల్టోస్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే స్కోరు పరంగా చూస్తే సియెర్రా కంటే కొంచెం తక్కువ పాయింట్లు వచ్చినప్పటికీ, 5-స్టార్ రేటింగ్ సాధించడం అనేది ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు. బలమైన మెటల్ బాడీ, అత్యాధునిక ఇంజనీరింగ్ తో తయారైన ఈ కొత్త డస్టర్, అటు ఆఫ్ రోడింగ్ కు ఇటు సిటీ ప్రయాణాలకు ఒక పర్ఫెక్ట్ ఎస్‌యూవీగా పేరు తెచ్చుకుంటోంది.