Renault Duster vs Kia Seltos : రెనో డస్టర్ Vs కియా సెల్టోస్.. సేఫ్టీ టెస్టులో రెండూ రారాజులే.. కానీ విజేత ఎవరంటే?
సేఫ్టీ టెస్టులో రెండూ రారాజులే.. కానీ విజేత ఎవరంటే?
Renault Duster vs Kia Seltos : భారతదేశంలో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కారు కొనేటప్పుడు మైలేజీతో పాటు సేఫ్టీకి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత పాపులర్ అయిన రెనో డస్టర్, కియా సెల్టోస్ మధ్య అసలైన పోటీ మొదలైంది. భారత్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రేష్ టెస్టుల్లో ఈ రెండు కార్లు అదరగొట్టాయి. మరి ప్రాణ రక్షణలో ఏది మొనగాడు? ఫీచర్లలో ఏది తోపు? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
సేఫ్టీ స్కోరులో స్వల్ప తేడా
భారత్ ఎన్‌క్యాప్ క్రేష్ టెస్టులో రెనో డస్టర్, కియా సెల్టోస్ రెండు కార్లు కూడా 5-స్టార్ రేటింగ్ సాధించాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే కియా సెల్టోస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. అడల్ట్ ప్యాసింజర్ సేఫ్టీ (పెద్దల భద్రత) విషయానికి వస్తే సెల్టోస్ 32 పాయింట్లకు గాను 31.70 స్కోర్ సాధించి బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఇక రెనో డస్టర్ 30.49 పాయింట్లు సాధించి తన సత్తా చాటుకుంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్టులో సెల్టోస్ స్ట్రక్చర్ కొంచెం బలంగా ఉన్నట్లు తేలింది.
పిల్లల భద్రతలో సమజ్జీవులు
చైల్డ్ సేఫ్టీ (పిల్లల భద్రత) విషయంలో మాత్రం ఈ రెండు కార్లు ఒకే రకమైన రక్షణ కనబరిచాయి. 49 పాయింట్లకు గాను రెండూ కూడా సమానంగా 45 పాయింట్లు సాధించాయి. డైనమిక్ టెస్టులు, సీట్ ఇన్స్టాలేషన్ వంటి అన్ని అంశాల్లో ఈ రెండు ఎస్‌యూవీలు పిల్లలకు అత్యంత సురక్షితమైనవని రుజువయ్యింది. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఈ రెండు కార్లలోనూ స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి.
ఫీచర్లు, సేఫ్టీ ప్యాకేజీ
ఈ రెండు కార్లలో సేఫ్టీ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా వస్తున్నాయి. కియా సెల్టోస్ కొంచెం ప్రీమియం ఫీచర్లతో అలరిస్తుండగా, రెనో డస్టర్ తనదైన పేడెస్ట్రియన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (బాటసారుల భద్రత) తో ఆకట్టుకుంటోంది. సైడ్ ఇంపాక్ట్ టెస్టులో రెండూ కూడా 16కి 16 పాయింట్లు సాధించడం విశేషం.
ధర, వాల్యూ ఫర్ మనీ
ధర విషయానికి వస్తే రెనో డస్టర్ కొంచెం అందుబాటు ధరలో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.18.49 లక్షల మధ్య ఉండగా, కియా సెల్టోస్ ధర రూ.10.99 లక్షల నుండి రూ.19.99 లక్షల వరకు ఉంది. దాదాపు సమానమైన సేఫ్టీ రేటింగ్ ఉండి, ఫీచర్లలో పెద్దగా తేడా లేనందున బడ్జెట్ ఆలోచించే వారికి డస్టర్ మంచి ఆప్షన్. లేదు మాకు కొంచెం మోడ్రన్ లుక్, ప్రీమియం ఇంటీరియర్ కావాలనుకునే వారు కియా సెల్టోస్ వైపు మొగ్గు చూపవచ్చు.