Renault : రెనాల్ట్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. మార్చి నెలాఖరు వరకు రూ.80 వేల వరకు డిస్కౌంట్

మార్చి నెలాఖరు వరకు రూ.80 వేల వరకు డిస్కౌంట్

Update: 2026-03-28 12:05 GMT

Renault : కొత్త కారు కొనాలనుకునే వారికి మార్చి నెల అదిరిపోయే వార్తను మోసుకొచ్చింది. ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్ అన్నీ కలిపి ఏకంగా రూ.80,000 వరకు ఆదా చేసుకునే సువర్ణావకాశాన్ని కస్టమర్లకు కల్పిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

రెనాల్ట్ క్విడ్

మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మొదటిసారి కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ క్విడ్ ఎప్పుడూ ఫేవరెట్. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నగరాల్లో నడపడానికి ఎంతో అనువైన ఈ కారుపై మార్చి 2026 ఆఫర్‌లో భాగంగా మొత్తం రూ. 70,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, పాత వాహనాన్ని మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంటుంది. తక్కువ ధరలో మంచి లుక్, ఫీచర్లు ఉన్న కారు కావాలనుకునే వారికి ఇది ఒక హాట్ డీల్ అని చెప్పవచ్చు.

రెనాల్ట్ ట్రైబర్

భారతదేశంలో అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరు తెచ్చుకున్న రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి, ఎక్కువ స్పేస్ కోరుకునే వారికి ట్రైబర్ బెస్ట్ ఛాయిస్. మార్చి ఆఫర్లలో దీనిపై ఏకంగా రూ.80,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. తన సెగ్మెంట్లో అత్యంత వాల్యూ ఫర్ మనీ కారుగా ఉన్న ట్రైబర్, ఈ భారీ తగ్గింపుతో మరింత ఆకర్షణీయంగా మారింది. ఇందులో సీట్లను అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే సదుపాయం ఉండటం ఈ కారు ప్రత్యేకత.

రెనాల్ట్ కైగర్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కారు రెనాల్ట్ కైగర్. స్పోర్టీ డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్ ఆప్షన్లతో వచ్చే కైగర్‌పై కూడా రూ. 80,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌యూవీ లుక్ కోరుకుంటూ బడ్జెట్‌లో కారు కావాలనుకునే వారికి కైగర్ సరైన ఎంపిక. ముఖ్యంగా ఈ మార్చి నెలలో ఇచ్చే లాయల్టీ బెనిఫిట్స్ పాత రెనో కస్టమర్లకు మరింత లాభాన్ని చేకూరుస్తాయి.

ఎందుకు ఈ డిస్కౌంట్లు?

ప్రతి ఏడాది మార్చి నెలలో ఆటోమొబైల్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేయడానికి, ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్లను రీచ్ అవ్వడానికి ఇలాంటి భారీ ఆఫర్లను ఇస్తుంటాయి. ఏప్రిల్ నుండి కార్ల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, కస్టమర్లను ఆకర్షించడానికి రెనాల్ట్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన అదనపు డిస్కౌంట్లు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి, కొత్త కారు కొనాలనే ఆలోచన ఉంటే ఇదే సరైన సమయం.

Tags:    

Similar News