EV Charging Tech: ఎలక్ట్రిక్ కార్ల రంగంలో సంచలనం.. నిమిషం ఛార్జింగ్‌తో 100 కిమీ మైలేజ్ ఇచ్చే కొత్త బ్యాటరీ
100 కిమీ మైలేజ్ ఇచ్చే కొత్త బ్యాటరీ
EV Charging Tech: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కస్టమర్లను ఎక్కువగా వేధించే ప్రధాన సమస్య మాత్రం ఛార్జింగ్ సమయం, డ్రైవింగ్ రేంజ్. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లలో కొన్ని నిమిషాల్లోనే ఇంధనం నింపుకుని ప్రయాణం ప్రారంభించవచ్చు కానీ, ఎలక్ట్రిక్ కార్లను ఫుల్ ఛార్జ్ చేయడానికి గంటల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రధాన సమస్యను పూర్తిగా నివారించడానికి ప్రపంచంలోని ప్రముఖ ఆటోమొబైల్, బ్యాటరీ తయారీ కంపెనీలు సరికొత్త పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీ దిగ్గజం సన్‌వోడా ఈవీబీ సరికొత్త 15C ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీని మార్కెట్లోకి తెచ్చి సంచలనం సృష్టించింది.
కొత్త 15C LFP బ్యాటరీ ప్రత్యేకతలు
సన్‌వోడా ఈవీబీ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన ఈ అత్యాధునిక 15C LFP బ్యాటరీ టెక్నాలజీ ఛార్జింగ్ వేగాన్ని పూర్తిగా మార్చివేయనుంది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ బ్యాటరీని కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే 10 శాతం నుంచి 70 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కేవలం 9 నిమిషాల్లోనే ఏకంగా 97 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రిక్ కారును కేవలం ఒక్క నిమిషం పాటు ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే వాస్తవ ప్రపంచంలో ఈ మైలేజ్ అనేది కారు మోడల్, బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ చేసే విధానం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అధిక వేగంలోనూ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే సిస్టమ్
సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలను అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా ఛార్జ్ చేసేటప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. ఇలా ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం వల్ల బ్యాటరీ భద్రత, పనితీరు, ఆయుష్షు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే సన్‌వోడా సంస్థ తమ కొత్త 15C బ్యాటరీలో ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నట్లు వెల్లడించింది. ఎంత వేగంగా ఛార్జ్ చేసినప్పటికీ, ఈ బ్యాటరీ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కూడా తన ఉష్ణోగ్రతను అద్భుతంగా నియంత్రించుకోగలదని కంపెనీ స్పష్టం చేసింది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు.
తీవ్రమైన చలి వాతావరణంలోనూ అద్భుతమైన పర్ఫామెన్స్
చాలా ప్రాంతాలలో విపరీతమైన చలి లేదా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు సరిగ్గా పనిచేయవు. ఛార్జింగ్ కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. కానీ సన్‌వోడా కొత్త బ్యాటరీ ఈ విషయంలోనూ అద్భుతాలు చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఏకంగా మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల వాతావరణంలో కూడా ఈ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లో 10 నుంచి 97 శాతం వరకు ఛార్జ్ కాగలదని పేర్కొన్నారు. ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా వాహనానికి సుమారు 700 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే ఈ అద్భుతమైన దావాలను ఇప్పటివరకు ఏ ఇతర స్వతంత్ర సంస్థ కూడా పూర్తిగా ధృవీకరించలేదు. ఈ టెక్నాలజీ త్వరలోనే వాస్తవ రూపం దాలిస్తే ఈవీ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం.