Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి.. ధర ఎంతంటే ?

ఫీచర్లు అదిరిపోయాయి.. ధర ఎంతంటే ?

Update: 2026-05-28 12:31 GMT

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారత మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యం బుల్లెట్ అనే పేరు వింటేనే బైక్ లవర్స్‌లో ఒక రకమైన పూనకం వచ్చేస్తుంది. దశాబ్దాలుగా భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఐకానిక్ బైక్, ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత పవర్ఫుల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 గురువారం అధికారికంగా భారత మార్కెట్లో విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 3.65 లక్షలుగా కంపెనీ ఖరారు చేసింది. గతంలో జరిగిన ప్రసిద్ధ EICMA 2025 ఆటో షోలో మొదటిసారి ప్రదర్శనకు ఉంచిన ఈ బైక్‌ను, ఎట్టకేలకు ఇప్పుడు దేశీయ కస్టమర్ల ముందుకు తెచ్చింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన పాపులర్ 650cc లైనప్‌లో ఈ సరికొత్త బుల్లెట్ చేరిపోయింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూప‌ర్ మీటియార్ 650, బేర్ 650 వంటి పవర్‌ఫుల్ బైక్‌లు దూసుకుపోతుండగా.. ఇప్పుడు బుల్లెట్ కూడా తోడైంది. 1932 లో మొదటిసారి పరిచయమైన బుల్లెట్ బ్రాండ్‌లో.. ఇప్పటివరకు తయారైన మోటార్ సైకిళ్లన్నింటికంటే ఇదే అత్యంత శక్తివంతమైన బుల్లెట్ అని కంపెనీ గర్వంగా ప్రకటించింది.

డిజైన్ విషయానికొస్తే, కొత్త బుల్లెట్ 650 చూడటానికి క్లాసిక్ 350, క్లాసిక్ 650 ట్విన్ మోడళ్లను పోలి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సిగ్నేచర్ స్టైల్ అయిన క్రోమ్ హెడ్‌లైట్, మెరిసిపోయే క్రోమ్ ఫినిషింగ్, వింటేజ్ టెయిల్ లైట్‌ను ఇందులో అలాగే ఉంచారు. దీనివల్ల పాత బుల్లెట్ రాయల్టీ ఏమాత్రం తగ్గలేదు. ఫ్యూయల్ ట్యాంక్‌పై చేత్తో గీసిన ప్రసిద్ధ పిన్‌స్ట్రైప్స్ డిజైన్, మెటల్ బ్యాడ్జ్ బైక్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చాయి. క్లాసిక్ 650 తో పోలిస్తే దీని ఫెండర్లు కొంచెం బాక్సీ ఆకారంలో ఉంటాయి. లాంగ్ రైడ్స్‌లో డ్రైవర్, వెనుక కూర్చునే వారికి నడుము నొప్పి రాకుండా ఉండేలా అత్యంత కంఫర్టబుల్ సింగిల్ పీస్ సీట్‎ను ఇందులో డిజైన్ చేశారు.

కొత్త బుల్లెట్ 650 బైక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన అత్యంత నమ్మకమైన 647.95cc ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 47 bhp పవర్‌ను, 52.3 Nm టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి పవర్‌ఫుల్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. హైవేలపై లాంగ్ టూరింగ్ వెళ్లే వారికి, క్రూయిజ్ రైడింగ్‌ను ఇష్టపడే వారికి ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఎంత స్పీడ్‌గా వెళ్లినా ఇంజన్ వైబ్రేషన్స్ రాకుండా స్మూత్ రైడింగ్ ఇచ్చేలా దీన్ని ట్యూన్ చేశారు.

హార్డ్‌వేర్ పరంగా ఈ బైక్‌ను చాలా పటిష్టమైన స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. బైక్ ముందు భాగంలో 43mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లను ఇచ్చారు. రోడ్డుపై గ్రిప్ కోసం ముందు 19-ఇంచుల వీల్, వెనుక 18-ఇంచుల వీల్ సెటప్ కలదు. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ముందు వైపు 320 mm భారీ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 300 mm డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. అత్యవసర సమయాల్లో బైక్ స్కిడ్ అవ్వకుండా రక్షణ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఫీచర్‌ను అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌గా అందించారు.

ఈ భారీ బుల్లెట్ టోటల్ బరువు 243 కిలోలుగా ఉంది. సీటు ఎత్తు 800 mmగా ఉండటం వల్ల సాధారణ ఎత్తు ఉన్నవారు కూడా ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. లాంగ్ ట్రిప్స్ వెళ్లేటప్పుడు పదే పదే పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగే తిప్పలు లేకుండా.. ఇందులో ఏకంగా 14.8 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. మార్కెట్లో ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 బైక్.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650, కవాసాకి ఎలిమినేటర్ వంటి క్లాసిక్ క్రూయిజర్ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. పాత కాలపు రాజసం, మోడ్రన్ పవర్ కలయికతో వచ్చిన ఈ బైక్ బుల్లెట్ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News