Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడపాలని ప్రతి యువకుడికీ కోరిక ఉంటుంది. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్య కమ్యూటర్ బైక్‌ల నుంచి అప్‌గ్రేడ్ కావాలనుకునే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. గత కొన్నేళ్లుగా కంపెనీ కూడా హిమాలయన్ 450, గెరిల్లా 450, 650cc లాంటి ఖరీదైన, హై-పవర్ బైక్‌లపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్న కస్టమర్ల కోసం కూడా అద్భుతమైన ప్రత్యామ్నాయాలు తెచ్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే 250cc ఇంజిన్ సామర్థ్యంతో సరసమైన ధరలో కొత్త బైక్‌లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

తాజా నివేదికల ప్రకారం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త 250cc బైక్‌లు 2027-28 ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే లాంచ్ తేదీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం ఒక్క బైక్‌తో సరిపెట్టకుండా మొత్తం 250cc ప్లాట్‌ఫామ్‌నే సిద్ధం చేయాలని కంపెనీ చూస్తోంది. అంతర్గతంగా ఈ ప్లాట్‌ఫామ్‌కు వి అనే కోడ్ నేమ్ పెట్టినట్లు తెలుస్తోంది. దీని ద్వారా భిన్నమైన డిజైన్లు, ధరలతో కూడిన అనేక మోడళ్లను తయారు చేయవచ్చు. మరోవైపు చైనా బైక్ తయారీ సంస్థ సీఎఫ్‌మోటోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకుంటుందనే చర్చ జరుగుతున్నా, ఈ రెండు విషయాలపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

హైబ్రిడ్ ఇంజిన్‌తో 45 కిమీ మైలేజీ వస్తుందా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే 250cc బైక్‌ల ఇంజిన్, మైలేజీ గురించి ఆటో రంగంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ కొత్త మోడళ్లలో కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. పెట్రోల్ ఖర్చును తగ్గించేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కొత్త 250cc బైక్ లీటరుకు సుమారు 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో మైల్డ్-हाइబ్రిడ్ సిస్టమ్ ఉంటుందా లేక మరో రకమైన హైబ్రిడ్ టెక్నాలజీ వాడతారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

రూ.1.25 లక్షల నుంచే ధర ఉండే ఛాన్స్

కొత్త 250cc బైక్‌లకు అతిపెద్ద బలం వాటి తక్కువ ధరే కానుంది. ప్రస్తుతం ఉన్న 350cc మోడళ్ల కంటే తక్కువ ధరలో వీటిని ఉంచాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ భావిస్తోంది. తద్వారా తక్కువ బడ్జెట్ ఉన్న మధ్యతరగతి యువత కూడా సులభంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ సొంతం చేసుకునే వీలు కలుగుతుంది. ఈ కొత్త బైక్‌ల ప్రారంభ ధర సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అసలు ధరల వివరాలు లాంచ్ సమయంలోనే బయటకు రానున్నాయి.

200-250cc బైక్‌లకు పెరుగుతున్న క్రేజ్

దేశంలో పవర్‌ఫుల్ బైక్‌ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్న తరుణంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ వ్యూహాన్ని రచించడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరంలో 250cc పైబడి 800cc వరకు ఉన్న బైక్‌ల అమ్మకాలు 12.7 లక్షల యూనిట్లను దాటాయి (ఐదేళ్ల క్రితం ఇది 5.5 లక్షలుగా ఉండేది). అంతేకాకుండా, 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 200-250cc విభాగం బైక్‌ల అమ్మకాలు ఏకంగా 75 శాతం పెరిగి 1,91,126 యూనిట్లకు చేరాయి. ఈ భారీ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు 250cc సెగ్మెంట్‌పై కన్నేసింది.

Tags: