Royal Enfield Sales : రాయల్ ఎన్‌ఫీల్డ్ జోరు.. ఫిబ్రవరిలో 91 వేలకు పైగా బైక్‌ల విక్రయం

ఫిబ్రవరిలో 91 వేలకు పైగా బైక్‌ల విక్రయం

Update: 2026-03-27 07:06 GMT

Royal Enfield Sales : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంభీరమైన శబ్దం, క్లాసిక్ లుక్‌తో కుర్రాళ్ల నుంచి ముసలివాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే ఈ బైక్‌లు.. 2026 ఫిబ్రవరి నెలలో సేల్స్ పరంగా దుమ్మురేపాయి. అంతర్జాతీయంగా ఎన్నో కొత్త మోడల్స్ వస్తున్నా, బుల్లెట్ అంటే పడిచచ్చే అభిమానుల వల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు అదిరిపోయే స్థాయిలో పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ తన మార్కెట్ వాటాను గణనీయంగా పెంచుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాల జోరు

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఫిబ్రవరి 2026లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 91,248 యూనిట్ల బైక్‌లను విక్రయించింది. ఇది 2025 ఫిబ్రవరిలో అమ్ముడైన 80,799 యూనిట్ల కంటే 12.93 శాతం ఎక్కువ. కంపెనీ ప్రధానంగా తన 350సీసీ పోర్ట్‌ఫోలియోపై ఆధారపడి ఈ స్థాయికి చేరుకుంది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, మీటియోర్ 350 వంటి మోడల్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ విజయానికి వెన్నెముకగా నిలిచాయి.

క్లాసిక్ 350 - ఎప్పటికీ ఆల్ రౌండరే

కంపెనీ మోడల్స్ అన్నింటిలోకి క్లాసిక్ 350 తన హవాను కొనసాగిస్తోంది. ఫిబ్రవరిలో ఈ ఒక్క మోడలే 34,307 యూనిట్లు అమ్ముడైంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇందులో 11.96 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు లెజెండరీ బైక్ బుల్లెట్ 350 కూడా 21,821 యూనిట్ల విక్రయాలతో 13.39 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అయితే, జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఈ బైక్ విక్రయాలు స్వల్పంగా తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా డిమాండ్ మాత్రం తగ్గలేదు.

హంటర్, మీటియోర్ ల హ్యాట్రిక్

తక్కువ ధరలో లభించే హంటర్ 350 యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరిలో 20,234 యూనిట్ల హంటర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది కంటే 21.90 శాతం ఎక్కువ. అలాగే లాంగ్ రైడ్స్ కు ఫేమస్ అయిన మీటియోర్ 350 కూడా 22.34 శాతం వార్షిక వృద్ధితో 8,817 యూనిట్ల మార్కును అందుకుంది. ఈ నాలుగు మోడల్స్ కలిపి రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాల్లో సుమారు 93 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.

ప్రీమియం సెగ్మెంట్‌లో నిరాశ

350సీసీ విభాగంలో దూసుకుపోతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు భారీ ఇంజిన్ ఉన్న ప్రీమియం బైక్‌ల విషయంలో మాత్రం కాస్త నిరాశ ఎదురైంది. 650 ట్విన్స్ (ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ జీటీ) అమ్మకాలు ఏకంగా 23.28 శాతం తగ్గాయి. సూపర్ మీటియోర్ 650 కూడా 27.05 శాతం క్షీణతను చూసింది. ఇది ప్రీమియం క్రూయిజర్ సెగ్మెంట్‌లో డిమాండ్ తగ్గుముఖం పట్టినట్లు సూచిస్తోంది. అయితే హిమాలయన్ 450 విక్రయాలు మాత్రం నెలవారీగా చూస్తే 29.93 శాతం పెరగడం విశేషం.

చిన్న సెగ్మెంట్ లోనే పెద్ద లాభం

మొత్తంగా చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా తన పాత 350సీసీ సామ్రాజ్యం మీదనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఫిబ్రవరి విక్రయాల్లో 85,179 యూనిట్లు కేవలం 350సీసీ బైక్‌లే కావడం గమనార్హం. 450సీసీ సెగ్మెంట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 650సీసీ సెగ్మెంట్ లో అమ్మకాలు 26 శాతం పైగా తగ్గడం కంపెనీ ఆలోచించాల్సిన విషయమే అయినప్పటికీ, ఓవరాల్ సేల్స్ లో రెండంకెల వృద్ధిని సాధించి రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సత్తా చాటుకుంది.

Tags:    

Similar News