Second Hand Cars: వాడిన ఎలక్ట్రిక్ కారును తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కేవలం కారు లుక్, మోటార్, ధర చూసి తొందరపడి డీల్ ఓకే చేయకండి. బ్యాటరీ ఆరోగ్యాన్ని సరిగ్గా తనిఖీ చేయకుండా సెకండ్ హ్యాండ్ ఈవి కొంటే భవిష్యత్తులో భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

కారు కండిషన్ కంటే బ్యాటరీ హెల్త్ రిపోర్ట్ ముఖ్యం

సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీయే అత్యంత కీలకమైన భాగం. కారు మొత్తం ధరలో సగం కంటే ఎక్కువ ఖర్చు బ్యాటరీకే అవుతుంది. అందుకే యూజ్డ్ ఈవి కొనేముందు వాహన యజమాని నుంచి స్టేట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రిపోర్ట్ ద్వారా బ్యాటరీ మొదట్లో ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం ఎంత శాతం పని చేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. కారు సిస్టమ్ లేదా కంపెనీ యాప్‌లో ఈ వివరాలు కనిపించకపోతే, కారును మంచి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించడం చాలా మంచిది.

కంపెనీ చెప్పే రేంజ్ వేరు.. రోడ్డుపై వచ్చే రేంజ్ వేరు

సెకండ్ హ్యాండ్ ఈవిని పరీక్షించేటప్పుడు డాష్‌బోర్డ్‌పై కనిపించే అంచనా రేంజ్‌ను మాత్రమే నమ్మకూడదు. టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలో కారు నిజమైన పరిస్థితుల్లో ఎంత దూరం ప్రయాణిస్తుందో గమనించాలి. కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్‌కు, కారు నిజంగా ఇస్తున్న మైలేజీకి మధ్య భారీ తేడా ఉంటే ఆ బ్యాటరీ సామర్థ్యం తగ్గినట్లే లెక్క. రేంజ్‌లో తేడాలు ఎక్కువగా ఉంటే కొనుగోలు నిర్ణయాన్ని పునరాలోచించడం శ్రేయస్కరం.

ఛార్జింగ్ సమస్యలు, పాత యజమాని అలవాట్లు

బ్యాటరీ ఆరోగ్యం పాడైతే దాని ప్రభావం నేరుగా ఛార్జింగ్ సమయంపై పడుతుంది. కారు పూర్తిగా ఛార్జ్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నా, ఛార్జింగ్ మధ్యలోనే ఆగిపోతున్నా దాన్ని తీవ్రమైన సమస్యగా భావించాలి. అంతేకాకుండా కారు పాత యజమాని దానిని ఎలా ఛార్జ్ చేసేవారో తెలుసుకోవడం ముఖ్యం. ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ వాడినట్లయితే బ్యాటరీ లైఫ్ త్వరగా క్షీణించే అవకాశం ఉంది.

వారంటీ, సర్వీస్ హిస్టరీ తనిఖీ చేయడం తప్పనిసరి

ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు బ్యాటరీలపై కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక వారంటీ ఇస్తారు. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న కారు బ్యాటరీ ఇంకా వారంటీ పరిధిలోనే ఉందో లేదో సరిచూసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించారా, గతంలో బ్యాటరీకి సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అనేది సర్వీస్ రికార్డులు చూసి తెలుసుకోవాలి. పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేటప్పుడు అనుభవజ్ఞులైన ఈవి ఎక్స్‌పర్ట్ ద్వారా పూర్తి టెస్ట్ చేయించడమే మీకు సురక్షితం.

Tags: