Sedan Car Sales: ఎస్‌యూవీల హవాలోనూ తగ్గేదేలే.. సేల్స్‌లో మారుతి డిజైర్ సరికొత్త రికార్డు
సేల్స్‌లో మారుతి డిజైర్ సరికొత్త రికార్డు
Sedan Car Sales: స్మార్ట్ లుక్స్, సౌకర్యవంతమైన ప్రయాణం, ఎక్కువ బూట్ స్పేస్ కోరుకునే వాహనదారులకు ఇప్పటికీ సెడాన్ కార్లే మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. భారత ఆటోమొబైల్ మార్కెట్లో జులై 2026 విక్రయాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జులై నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 37,728 సెడాన్ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది జులైలో నమోదైన 33,106 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 14 శాతం వృద్ధి చెందడం విశేషం. దైనందిన ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్‌లకు వీలుగా ఉండటంతో డిజైర్, ఆరా వంటి మోడళ్లకు కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు.
తిరుగులేని రాజాగా మారుతి డిజైర్
సేల్స్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ సరికొత్త సంచలనం సృష్టించింది. జులై నెలలో ఏకంగా 23,791 మంది కస్టమర్లు ఈ కారును ఇంటికి తీసుకెళ్లారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాల్లో 13 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం సెడాన్ విక్రయాల్లో ఒక్క డిజైర్ వాటానే ఏకంగా 63 శాతంగా నమోదు కావడం గమనార్హం. అంటే సెడాన్ కొనుగోలు చేసిన ప్రతీ పది మందిలో ఆరుగురు డిజైర్‌కే ఓటు వేశారు. అత్యధిక మైలేజ్, నమ్మకమైన బ్రాండ్ వ్యాల్యూ ఈ కారును అగ్రస్థానంలో నిలబెట్టాయి.
ఆరా, అమేజ్ జోరు.. హోండా ఊహించని జంప్
హ్యుందాయ్ ఆరా 5,817 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది జులైలో అమ్ముడైన 4,636 యూనిట్లతో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన కాగా, మార్కెట్లో 15 శాతం వాటాను దక్కించుకుంది. హోండా అమేజ్ 3,436 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది జులైలో విక్రయించిన 2,009 యూనిట్లతో పోలిస్తే అమేజ్ అమ్మకాలు ఏకంగా 71 శాతం పెరగడం విశేషం. మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ఈ రెండు మోడళ్లు గట్టి పోటీని ఇస్తున్నాయి.
వెనుకబడిన ప్రీమియం మోడళ్లు
లిస్టులో తదుపరి స్థానాల్లో ఉన్న మోడళ్ల అమ్మకాల్లో కొంత తగ్గుదల కనిపించింది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ 1,420 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉడగా, వార్షిక ప్రాతిపదికన 21 శాతం విక్రయాలు తగ్గాయి. స్కోడా స్లావియా 993 యూనిట్లతో (15 శాతం తగ్గుదల) ఐదో స్థానంలో, టాటా టిగోర్ 758 యూనిట్లతో (21 శాతం తగ్గుదల) ఆరో స్థానంలో నిలిచాయి. హ్యుందాయ్ వెర్నా 737 యూనిట్లు, హోండా సిటీ 571 యూనిట్ల విక్రయాలు సాధించాయి. ప్రీమియం మోడల్ టయోటా కామ్రీ 205 యూనిట్ల అమ్మకాలతో గతేడాది కంటే మెరుగైన వృద్ధి నమోదు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఎస్‌యూవీ కార్ల డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ, మధ్యతరగతి కుటుంబాలకు, టాక్సీ రంగానికి సెడాన్ కార్లు ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. తక్కువ ధర, మెరుగైన మైలేజ్ అందించే డిజైన్, ఆరా వంటి కార్లు రాబోయే పండుగల సీజన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.