Sedan Sales : ఎస్‌యూవీల కోటను బద్దలు కొట్టిన సెడాన్లు..విక్రయాల సునామీలో మారుతి డిజైర్ రికార్డు
విక్రయాల సునామీలో మారుతి డిజైర్ రికార్డు
Sedan Sales : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హోరు కనిపిస్తోంది. పెద్ద కార్లకే క్రేజ్ పెరుగుతున్న తరుణంలో కూడా, సెడాన్ కార్లు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. కంఫర్ట్, లగ్జరీ, స్టైలిష్ లుక్ కోరుకునే వారు ఇప్పటికీ సెడాన్ కార్లకే ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా మారుతి సుజుకి డిజైర్ లాంటి మోడళ్లు ఎస్‌యూవీల ప్రభంజనాన్ని తట్టుకుని విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. 2026 ప్రారంభంలో భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాప్ సెడాన్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్‌కు ఎదురులేదని మరోసారి రుజువైంది. డిసెంబర్ 2025లో ఏకంగా 19,072 యూనిట్ల విక్రయాలతో ఈ కారు అగ్రస్థానంలో నిలిచింది. కేవలం రూ.6.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కొత్త మోడల్‌లో సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. దీని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 24.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ప్లస్ పాయింట్. సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉండటంతో సిటీ డ్రైవింగ్‌కు ఇది ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.
హ్యుందాయ్ ఆరా రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో గట్టి పోటీనిస్తోంది. డిసెంబర్‌లో 4,925 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇది కూడా సీఎన్‌జీ వేరియంట్‌లో లభిస్తూ మంచి మైలేజీని ఇస్తోంది. మరోవైపు, హోండా అమేజ్ తన నమ్మకమైన ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో 2,575 యూనిట్ల అమ్మకాలను సాధించింది. రూ.7.48 లక్షల ధరలో లభించే అమేజ్, ఫ్యామిలీ సెడాన్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
కాస్త ప్రీమియం అనుభూతిని కోరుకునే వారిని వోక్స్ వ్యాగన్ వర్టస్ ఆకట్టుకుంటోంది. దీనికి ఉన్న 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్ కారణంగా డిసెంబర్‌లో 2,378 యూనిట్లు అమ్ముడయ్యాయి. రూ.10.50 లక్షల నుంచి దీని ధర ప్రారంభమవుతుంది. ఇక సెడాన్లకే ఐకాన్ అయిన హోండా సిటీ 943 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో నిలిచింది. రూ.11.95 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు, సివిటి ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 18 కిలోమీటర్ల పైనే మైలేజీ ఇస్తూ లగ్జరీ ప్రియులను అలరిస్తోంది.
ఎస్‌యూవీల కంటే సెడాన్ కార్లలో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వెనుక సీట్లో కూర్చునే వారికి లభించే లెగ్ రూమ్, కుషనింగ్ సెడాన్లలో అద్భుతంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సెడాన్లు రోడ్డుకు అతుక్కుని వెళ్తున్న అనుభూతిని ఇస్తాయి. అందుకే హైవే ప్రయాణాలకు, సిటీలో స్టైలిష్ గా తిరగడానికి సెడాన్లు ఇప్పటికీ మొదటి ప్రాధాన్యతగా ఉంటున్నాయి.