Simple Energy: ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ సింపుల్ ఎనర్జీ సంస్థ తన నూతన మోడల్ 'సింపుల్ వేవ్' స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.1.09 లక్షలుగా నిర్ణయించిన ఈ స్కూటర్, కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రూపుదిద్దుకుంది. సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే వన్ ఎస్, ఆల్ట్రా మోడళ్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు కుటుంబాల కోసం ప్రత్యేకంగా వేవ్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. సముద్రంలో ఎగిసిపడే డాల్ఫిన్ రూపాన్ని ప్రేరణగా తీసుకుని దీనికి డిజైన్ చేశారు. చూడటానికి ఎంతో స్నేహపూర్వకంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ వాహనం డెలివరీలు 2026 సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి.

నాలుగు బ్యాటరీ ఆప్షన్లు.. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్

వినియోగదారుల భిన్న అవసరాలకు తగ్గట్లుగా 2.2 kWh, 2.7 kWh, 3.7 kWh, 5 kWh అనే నాలుగు బ్యాటరీ వేరియంట్లను పరిచయం చేశారు. చిన్న బ్యాటరీ మోడళ్లు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ టెక్నాలజీతో పనిచేస్తుండగా, పెద్ద బ్యాటరీ వెర్షన్లు నికెల్ కోబాల్ట్ అల్యూమినియం సాంకేతికతతో పనిచేస్తాయి. ఇందులో అమర్చిన జెన్ 3 బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 70 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. రేంజ్ విషయానికి వస్తే 5 kWh పెద్ద బ్యాటరీ కలిగిన వేరియంట్ ఏకంగా 243 కిలోమీటర్ల IDC రేంజ్‌ను అందిస్తుంది.

గిరిజన ప్రాంతాలు, కొండ దారుల్లోనూ చెలరేగే పెర్ఫార్మెన్స్

ఈ స్కూటర్‌లో అమర్చిన శక్తివంతమైన మోటార్ 8 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు కూర్చున్నా 20 డిగ్రీల నిటారుగా ఉండే కొండ దారులను సైతం సునాయాసంగా అధిగమించగలదని కంపెనీ స్పష్టం చేసింది. వేగం విషయానికొస్తే కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మోడల్‌ను బట్టి గరిష్టంగా గంటకు 75 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

ఏకంగా 70 లీటర్ల బూట్ స్పేస్

సాధారణ స్కూటర్లలో ఎక్కడా లేని విధంగా ఇందులో ఏకంగా 70 లీటర్ల బూట్ స్పేస్ అందించడం గమనార్హం. దీనివల్ల ప్రయాణాల్లో ఎక్కువ లగేజీని సులభంగా తీసుకెళ్లవచ్చు. భద్రత కోసం స్కూటర్ కిందపడే పరిస్థితి వస్తే మోటార్ పవర్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేసే డ్రాప్ సేఫ్ ఫీచర్‌ను జోడించారు. హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, క్రాల్ మోడ్ సహా శబ్దాన్ని తగ్గించే హష్‌డ్రైవ్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు. 7 ఇంచుల టీఎఫ్‌టీ స్క్రీన్, నేవిగేషన్, వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్లు, ఓటీఏ అప్‌డేట్లు ఈ స్కూటర్ సొంతం.

Tags: