Skoda Kodiaq RS : కార్ల లవర్స్‌కు స్కోడా బంపర్ ఆఫర్.. జూన్ 22 నుంచి కోడియాక్ ఆర్‌ఎస్ బుకింగ్స్ షురూ

జూన్ 22 నుంచి కోడియాక్ ఆర్‌ఎస్ బుకింగ్స్ షురూ

Update: 2026-06-11 13:13 GMT

Skoda Kodiaq RS : లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన మోస్ట్ అవేటెడ్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ 7-సీటర్ ఎస్‌యూవీ స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్‎ను లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ పవర్‌ఫుల్ కారు అఫీషియల్ బుకింగ్స్ జూన్ 22, 2026 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఇప్పటివరకు దీని లాంచ్ డేట్‌ను అనౌన్స్ చేయనప్పటికీ, జూలై నెలకల్లా ఈ కారు షోరూమ్‌లలో సందడి చేయనుందని సమాచారం. ఈ స్పెషల్ మోడల్‌ను విదేశాల నుంచి నేరుగా సీబీయూ (CBU) రూట్ ద్వారా భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్ లో కేవలం 50 యూనిట్లను మాత్రమే అమ్మకానికి ఉంచనున్నారు.

ధరల అంచనా, మార్కెట్ పోటీ

విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటున్న పర్ఫార్మెన్స్ ఎడిషన్ కారు కావడం వల్ల దీని ధర మార్కెట్లో కాస్త గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఆటోమొబైల్ వర్గాల అంచనా ప్రకారం, స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ప్రీమియం ధరతో వస్తున్న ఈ లగ్జరీ 7-సీటర్ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాక ఇప్పటికే మంచి సేల్స్ సాధిస్తున్న ఎంజీ గ్లోస్టర్ (ఇండియాలో మునుపటి గ్లేస్టర్ స్థానంలో వస్తున్న సరికొత్త మేజెస్టర్), ఫోక్స్‌వ్యాగన్ టైరూన్ ఆర్-లైన్ వంటి భారీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

రాకెట్ లాంటి వేగం.. మైండ్ బ్లాక్ చేసే పర్ఫార్మెన్స్

స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ కారులో పవర్‌ఫుల్ 2.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది ఏకంగా 265 bhp ల గరిష్ట పవర్‌ను, 400 Nm ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ కోడియాక్ మోడల్ కంటే ఇది 60 bhp ఎక్కువ పవర్‌ఫుల్ కావడం విశేషం. ఈ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీ (DCT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అంతేకాకుండా కారు నాలుగు చక్రాలకు సమానంగా పవర్ ఇచ్చే ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, దీని టాప్ స్పీడ్ గంటకు 231 కిలోమీటర్లని స్కోడా స్పష్టం చేసింది.

అధునాతన బ్రేకింగ్, సస్పెన్షన్ సిస్టమ్

సాధారణ మోడల్‌తో పోలిస్తే ఈ ఆర్‌ఎస్ వేరియంట్ లో సేఫ్టీ, బ్రేకింగ్ సిస్టమ్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో స్లాటెడ్ బ్రేక్ డిస్క్‌లతో పాటు ఫ్రంట్-యాక్సిల్‌పై రెండు-పాట్ కాలిపర్లను అమర్చారు. దీనివల్ల కారు ఎంత స్పీడ్‌లో ఉన్నా సరే బ్రేక్ వేసిన వెంటనే సురక్షితంగా ఆగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో లభించే కోడియాక్ ఆర్‌ఎస్ మోడల్‌లో రోడ్డును బట్టి అడ్జస్ట్ అయ్యే అడాప్టివ్ డాంపర్స్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అయితే ఇండియాకు రాబోయే 50 కార్లలో ఈ ఫీచర్ ఉంటుందా లేదా అనేదానిపై కంపెనీ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు.

స్పోర్టీ లుక్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్

లుక్స్ పరంగా స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్ సాధారణ కారు కంటే ఎంతో అగ్రెసివ్, స్పోర్టీగా కనిపిస్తోంది. ఇందులో సిగ్నేచర్ బ్లాక్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లతో కూడిన సరికొత్త 20 ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కలర్ సీ-పిల్లర్ హైలైట్‌గా నిలిచాయి. కారు విండో ఫ్రేమ్స్, రూఫ్ రైల్స్‌కు కూడా గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కారుకు ఒక ప్రీమియం లుక్ వచ్చింది. కారు లోపల క్యాబిన్ అంతా ఆల్-బ్లాక్ స్పోర్టీ థీమ్‌తో ముస్తాబైంది. వీటికి కాంట్రాస్ట్‌గా ఉండేలా రెడ్ కలర్ స్టిచ్చింగ్ లైన్లు, హెడ్‌రెస్ట్‌లపై ‘RS’ అనే ప్రత్యేకమైన బ్రాండింగ్ లోగో కలిగిన పటిష్టమైన సీట్లను అందించారు. లగ్జరీతో పాటు రేసింగ్ కార్ల అనుభూతిని కోరుకునే వారికి ఈ కారు ఒక అద్భుతమైన ఆప్షన్.

Tags:    

Similar News