Skoda Slavia: అద్దరిపోయే డిజైన్, నయా గేర్‌బాక్స్.. ఆగస్టు 18న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్
ఆగస్టు 18న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్
Skoda Slavia: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన స్కోడా స్లావియా, ఇప్పుడు కొత్త అవతారంలో మెరిసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 18న స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేయబోతోంది. టీజర్ల ద్వారా మార్కెట్‌లో భారీ అంచనాలను పెంచేసిన ఈ కారు, అధునాతన గేర్‌బాక్స్ సాంకేతికతతో రానుంది. స్టైలిష్ లుక్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో సెడాన్ సెగ్మెంట్‌లో ఇది సరికొత్త పోటీకి తెరలేపనుంది.
సరికొత్త రూపంలో ఫ్రంట్ లుక్
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా పలు ఆకర్షణీయమైన మార్పులను సంతరించుకుంది. మునుపటి కంటే మరింత దూకుడుగా ఉండేలా ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లాంప్స్, కొత్తగా రీడిజైన్ చేసిన ఫాగ్ లాంప్ హౌసింగ్, కొత్త బంపర్‌ను పొందుపరిచారు. కుషాక్ తరహాలోనే లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్న గ్రిల్ డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కొత్త అల్లాయ్ వీల్స్ ఈ సెడాన్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
ఇంటీరియర్ కేబిన్‌లో నయా ఫీచర్లు
కేబిన్ లోపల ప్రధానంగా డ్రైవర్ సౌకర్యానికి పెద్దపీట వేశారు. 10.25-ఇంచీల భారీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు సరికొత్త సీట్ అపోల్స్టరీని అమర్చారు. కుషాక్ మోడల్‌లో అందించిన విధంగానే దీనిలో కూడా రియర్ సీట్ మసాజ్ ఫంక్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు కేబిన్ అనుభూతిని మరింత లగ్జరీగా మారుస్తాయి. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ సామర్థ్యం.. కొత్త 8-స్పీడ్ గేర్‌బాక్స్
ఇంజిన్ ఆప్షన్లలో పాత లైన్-అప్‌నే కొనసాగిస్తున్నారు. 115 హెచ్‌పీ పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 150 హెచ్‌పీ పవర్ ఇచ్చే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి. 1.0-లీటర్ ఇంజిన్‌తో వచ్చే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, పాత ఆటోమేటిక్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. 1.5-లీటర్ వెర్షన్‌లో 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యథాతథంగా కొనసాగుతుంది.
ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్కోడా స్లావియా ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 18.19 లక్షల వరకు ఉంది. కొత్తగా తీసుకొస్తున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలలో కొద్దిపాటి పెంపు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చాక హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, ఫోక్స్‌వాగన్ వర్టస్ వంటి సెడాన్ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.