Car Buying Tips : కారు కొంటున్నారా? ఈ 20/4/10 ఫార్ములా తెలిస్తే లక్షల రూపాయలు ఆదా అవుతాయి

ఈ 20/4/10 ఫార్ములా తెలిస్తే లక్షల రూపాయలు ఆదా అవుతాయి

Update: 2026-04-24 14:41 GMT

Car Buying Tips : కొత్త కారు కొనడం అనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు, ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం కూడా. ముఖ్యంగా రూ.10 నుంచి 15 లక్షల బడ్జెట్‌లో కారు ప్లాన్ చేసేటప్పుడు.. లోన్ భారం మీ మీద పడకుండా ఉండాలంటే 20/4/10 అనే అద్భుతమైన ఫార్ములాను తెలుసుకోవాలి. ఈ ఒక్క సూత్రం పాటిస్తే మీ కారు కొనుగోలు ప్రయాణం టెన్షన్ లేకుండా సాగిపోవడమే కాకుండా, లక్షల రూపాయల వడ్డీని కూడా ఆదా చేయవచ్చు.

ఏమిటీ 20/4/10 నియమం?

ఆర్థిక క్రమశిక్షణతో కారు కొనాలనుకునే వారికి ఈ ఫార్ములా ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.

* 20 (డౌన్ పేమెంట్): కారు ఆన్-రోడ్ ధరలో కనీసం 20% మొత్తాన్ని మీరు డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి.

* 4 (లోన్ కాలపరిమితి): కారు లోన్ వ్యవధిని ఎట్టి పరిస్థితుల్లోనూ 4 సంవత్సరాల (48 నెలలు) కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు.

* 10 (నెలవారీ ఖర్చు): కారు ఈఎంఐ, పెట్రోల్/డీజిల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఇలా అన్నీ కలిపి మీ నెలవారీ ఆదాయంలో 10% మించకూడదు.

ఎక్కువ డౌన్ పేమెంట్ వల్ల కలిగే లాభాలేంటి?

చాలా బ్యాంకులు ఇప్పుడు 90% లేదా 100% ఫైనాన్స్ ఇస్తున్నాయి కదా అని ఎక్కువ లోన్ తీసుకోవడం పొరపాటు. మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే అంత తక్కువ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు 40% నుంచి 50% డౌన్ పేమెంట్ చేయగలిగితే, మీ ఈఎంఐ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ జీతంపై ఒత్తిడి పడదు, ఇతర సేవింగ్స్ మీద దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా, ఎక్కువ డౌన్ పేమెంట్ చేసే కస్టమర్లను బ్యాంకులు నమ్మదగిన వారుగా భావించి, తక్కువ వడ్డీ రేటుకే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

కారు విలువ తగ్గిపోతుంది.. జాగ్రత్త

చాలామంది మర్చిపోయే విషయం ఏంటంటే, కారు అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు, అదొక ఖర్చు. షోరూమ్ నుంచి కారు బయటకు వచ్చిన మొదటి ఏడాదే దాని విలువ 20-25% వరకు పడిపోతుంది. ఒకవేళ మీరు తక్కువ డౌన్ పేమెంట్ చేసి ఎక్కువ లోన్ తీసుకుంటే, ఏదైనా కారణం చేత కారును అమ్మాల్సి వస్తే.. మీరు కట్టాల్సిన లోన్ మొత్తం కారు అమ్మగా వచ్చే ధర కంటే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. దీనినే నెగటివ్ ఈక్విటీ అంటారు. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల ఈ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు.

రూ.15 లక్షల బడ్జెట్‌లో కారు తీసుకునేటప్పుడు సుమారు రూ.3 లక్షల నుంచి 4.5 లక్షల వరకు డౌన్ పేమెంట్ చేయడం సురక్షితం. అయితే, డౌన్ పేమెంట్ ఎక్కువ చేయాలని ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చు చేయకూడదు. ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకున్న తర్వాతే మిగిలిన మొత్తాన్ని కారు కోసం వాడాలి. సరైన ప్లానింగ్‌తో కారు కొంటే, ఆ ప్రయాణం ఆనందంగా ఉంటుంది తప్ప ఆర్థిక భారంగా మారదు.

Tags:    

Similar News