Hatchback vs SUV: హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల పరిస్థితి ఏంటి? సిటీ ట్రాఫిక్, హైవే ప్రయాణాలకు ఏది బెస్ట్ అంటే
| సిటీ ట్రాఫిక్, హైవే ప్రయాణాలకు ఏది బెస్ట్ అంటే
Hatchback vs SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లలో ప్రజల మొదటి ఛాయిస్ ఏంటని అడిగితే ఒక్క మాటలో చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే మన దేశంలో ప్రతి రకం కారుకు దానికి తగ్గ అవసరం, ప్రత్యేకమైన కస్టమర్ బేస్ ఉన్నాయి. అందుకే రోడ్లపై అన్ని సెగ్మెంట్ల కార్లు మనకు కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం అమ్మకాల గణాంకాలు, కస్టమర్ల ఆసక్తిని బట్టి చూస్తే ఏ విభాగం పైచేయి సాధిస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది.
మార్కెట్ అసలైన రారాజుగా నిలిచిన ఎస్యూవీ
ప్రస్తుతం భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎస్యూవీ, యుటిలిటీ వాహనాల ఆధిపత్యమే కొనసాగుతోంది. రోడ్డుపై ఠీవిగా కనిపించే లుక్, ఎత్తైన సీటింగ్, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, కుటుంబానికి సరిపడా విశాలమైన స్థలం ఉండటంతో కస్టమర్లు వీటికి ఓటేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదటిసారి కారు కొనేవారు కూడా చిన్న హ్యాచ్‌బ్యాక్‌లకు బదులుగా కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో లాంటి మోడళ్లు ప్రతినెలా భారీగా అమ్ముడవుతున్నాయి.
బడ్జెట్, మైలేజీలో ఇప్పటికీ హ్యాచ్బ్యాక్లదే పట్టు
ఎస్‌యూవీల వేగం ఎంతగా ఉన్నా, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ తన ఉనికిని ఇంకా కాపాడుకుంటూనే ఉంది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయాలనుకునేవారికి, ఇరుకు ప్రదేశాల్లో వెంటనే పార్కింగ్ చేసుకోవడానికి, తక్కువ బడ్జెట్లో మంచి మైలేజీ కోరుకునేవారికి హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇప్పటికీ తెలివైన ఎంపికగా నిలుస్తున్నాయి. మారుతి వ్యాగన్ఆర్, బాలెనో, స్విఫ్ట్ లాంటి కార్లు నేటికీ ప్రతినెలా టాప్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఎంట్రీ లెవల్ చిన్న కార్ల మార్కెట్ వాటా మాత్రం గణనీయంగా తగ్గింది.
కొన్ని మోడళ్లతోనే నెట్టుకొస్తున్న సెడాన్ కార్లు
ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు కలల కారుగా ఉన్న సెడాన్ సెగ్మెంట్ వాటా ఇప్పుడు ఎస్‌యూవీల ధాటికి బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతి డిజైర్ ఇప్పటికీ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇక మిడ్-సైజ్ సెడాన్లలో ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ లాంటి ఎంపిక చేసిన మోడళ్లకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. క్లాసీ లుక్, సౌకర్యవంతమైన క్యాబిన్, హైవేలపై స్మూత్ డ్రైవింగ్ కోరుకునేవారు ఇప్పటికీ సెడాన్ కార్లనే ఎంచుకుంటున్నారు.
ఎస్‌యూవీల క్రేజ్ పెరగడానికి అసలు కారణాలివే
భారతీయ కొనుగోలుదారుల ఆలోచనలో వచ్చిన ఈ భారీ మార్పు వెనుక అనేక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రజల ఆదాయం పెరగడం, బ్యాంకుల నుంచి సులభంగా కార్ లోన్లు, ఫైనాన్స్ సౌకర్యం దొరకడం ఇందుకు ప్రధాన కారణాలు. వీటితో పాటు మన దేశంలోని గుంతల రోడ్లపై సాఫీగా వెళ్లేందుకు ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ అవసరం ఉండటం, పెద్ద కారు నడుపుతున్నామనే స్టేటస్ కలగడం అన్నీ కలిసి ఎస్‌యూవీలను మార్కెట్లో నంబర్-1 స్థానంలో నిలబెట్టాయి.