Maruti Suzuki: మారుతి కాంపాక్ట్ కార్లలో కొత్త విప్లవం.. ఫ్రాంక్స్, బాలెనో కార్లకు హైబ్రిడ్ పవర్
హైబ్రిడ్ పవర్
Maruti Suzuki: ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి కాంపాక్ట్ కార్ల విభాగంలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ తో పాటు రేంజ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేంజ్ ఎక్స్‌టెండర్ సిస్టమ్‌లో ప్లగ్-ఇన్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీన్ని కంపెనీ ఆర్ఈఈవీ లైట్ అని పిలుస్తోంది. మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన సుజుకి ఫ్రాంక్స్, బాలెనో కార్లలో ఈ కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌ను మొదటగా అందించే అవకాశం ఉంది.
ఆర్ఈఈవీ లైట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
సుజుకి రూపొందిస్తున్న ఈ కొత్త రేంజ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీ కాస్త భిన్నంగా పనిచేస్తుంది. ఈ కార్లలో చక్రాలను తిప్పే బాధ్యత పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ చూసుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ మాత్రం నేరుగా చక్రాలను నడిపించకుండా, కేవలం అవసరమైనప్పుడు బ్యాటరీకి విద్యుత్‌ను అందించే జనరేటర్‌గా పనిచేస్తుంది. దీనిలో ప్లగ్-ఇన్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంటుంది. కారులో ఛార్జింగ్ పోర్ట్, చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చడం వల్ల పెద్ద బ్యాటరీల బరువు లేకుండానే ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
1.2 లీటర్ ఇంజిన్ జనరేటర్‌గా మార్పు
ఈ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ల కోసం సుజుకి తన వద్ద ఉన్న 1.2 లీటర్ 3-సిెలెండర్ జెడ్12ఈ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. ఈ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ నేరుగా చక్రాలను తిప్పకుండా ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ ఇస్తుంది. మోటార్ ఆ విద్యుత్‌ను వినియోగించి కారును ముందుకు నడిపిస్తుంది. టయోటా టెక్నాలజీతో వచ్చిన గ్రాండ్ విటారా వంటి కార్లలో వాడిన హైబ్రిడ్ సిస్టమ్ కన్నా ఇది పూర్తిగా భిన్నమైనదిగా కంపెనీ చెబుతోంది.
ఒకే బేస్‌పై రెండు రకాల హైబ్రిడ్ టెక్నాలజీలు
సుజుకి కంపెనీ సీరీస్ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌లను వేర్వేరుగా తయారు చేయకుండా ఒకే కామన్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు సిస్టమ్‌లలో ఒకే రకమైన బేసిక్ డిజైన్‌ను వాడటం ద్వారా తయారీ ప్రక్రియ మరింత సులభమవుతుంది. చిన్న కార్ల కోసం రూపొందించే ఈ హైబ్రిడ్ టెక్నాలజీలో మైలేజ్, డ్రైవింగ్ పర్ఫామెన్స్, తక్కువ ఖర్చు మధ్య సరైన బ్యాలెన్స్ ఉండేలా చూస్తున్నారు. దీనివల్ల సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే కార్బన్ ఉద్గారాలు సుమారు 15 శాతం వరకు తగ్గుతాయని కంపెనీ పేర్కొంది.
ఫ్రాంక్స్, బాలెనో కార్ల రూపురేఖలు మారనున్నాయా?
ఫ్రాంక్స్, బాలెనో కార్లు ఇప్పటికే భారతీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ మోడల్స్‌లో ఈ కొత్త హైబ్రిడ్ టెక్నాలజీ ప్రవేశపెడితే ఇంధన సామర్థ్యం భారీగా పెరుగుతుంది. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం కోరుకునే కస్టమర్లకు ఇదొక చక్కటి ఎంపికగా నిలుస్తుంది. భవిష్యత్తులో రాబోయే ఈ ఎలక్ట్రిఫైడ్ కార్లు ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.