Suzuki : సుజుకి స్కూటర్ల సునామీ.. ఒక్క నెలలో 1.22 లక్షల విక్రయాలు
ఒక్క నెలలో 1.22 లక్షల విక్రయాలు
Suzuki : టూ-వీలర్ మార్కెట్లో జపాన్ దిగ్గజం సుజుకి సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ముఖ్యంగా 125cc స్కూటర్ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ, డిసెంబర్ 2025లో ఊహించని స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. కేవలం 31 రోజుల్లోనే ఏకంగా 1.22 లక్షల వాహనాలను విక్రయించి, ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ సక్సెస్‌లో సుజుకికి చెందిన రెండు మోడళ్లు ప్రధాన పాత్ర పోషించాయి.
సుజుకి మోటార్ సైకిల్ ఇండియా డిసెంబర్ 2025లో మొత్తం 1,22,366 యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2024 డిసెంబర్ (96,804 యూనిట్లు)తో పోలిస్తే ఇది 26.41% భారీ వృద్ధి. సాధారణంగా పండగ సీజన్ ముగిసిన తర్వాత డిసెంబర్‌లో అమ్మకాలు తగ్గుతుంటాయి, కానీ సుజుకి మాత్రం తన జోరును కొనసాగించడం విశేషం. నవంబర్ 2025తో పోల్చినా (1,22,300 యూనిట్లు) అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి.
సుజుకి బ్రాండ్‌ను ఇంటింటికీ తీసుకెళ్లిన ఘనత యాక్సెస్ 125దే. సింపుల్ డిజైన్, మంచి మైలేజ్ (సుమారు 50-60కిమీ) ఇచ్చే ఈ స్కూటర్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక యువతను టార్గెట్ చేస్తూ వచ్చిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 తన మ్యాక్సీ-స్కూటర్ లుక్‌తో మార్కెట్లో హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. ఈ రెండు మోడళ్లు దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశీ ఎగుమతుల్లో కూడా సుజుకికి లాభాల పంట పండిస్తున్నాయి.
సుజుకి కేవలం ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగానూ సత్తా చాటుతోంది. డిసెంబర్‌లో కంపెనీ 24,543 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది గతేడాది కంటే 36.58% ఎక్కువ. డొమెస్టిక్ మార్కెట్లో 97,823 వాహనాలను విక్రయించి దాదాపు 80% వాటాను దేశీయంగానే సొంతం చేసుకుంది. స్పేర్ పార్ట్స్ బిజినెస్‌లో కూడా రూ. 96 కోట్ల ఆదాయంతో కంపెనీ ఆల్‌టైమ్ హై రికార్డును క్రియేట్ చేసింది.