Tata Harrier EV : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ మరోసారి తన సత్తాను చాటనుంది. ఎంజీ మోటార్, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి పోటీదారుల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న టాటా, ఇప్పుడు తన సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'టాటా హారియర్ EV' (Tata Harrier EV) తో సిద్ధంగా ఉంది. ఈ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం కస్టమర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ కారు గురించి వివరంగా తెలుసుకుందాం.

టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో (Auto Expo) ఈ కారును మొదటిసారి ప్రదర్శించింది. అప్పటి నుండి దీని విడుదల కోసం ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఈ కారు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు బుకింగ్‌లు జూలై 2 నుండి ప్రారంభమవుతాయి. టాటా హారియర్ EV కేవలం ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మాత్రమే కాదు. దీని ఆఫ్-రోడింగ్ సామర్థ్యం (off-roading capacity) దీనిని ఎక్కడికైనా దూసుకెళ్తుంది. ఈ కారు ప్యూర్ EV ఆర్కిటెక్చర్ పై రూపొందించారు. ఇందులో QWD (Quad-Wheel Drive) డ్యూయల్ మోటార్ సెటప్ ఉంది. ఇది రీర్ వీల్ డ్రైవ్ (RWD) నుంచి ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ కారులో 116 kW, 175 kW పవర్ ఆప్షన్లు ఉంటాయి. దీని పీక్ టార్క్ 504 Nm వరకు ఉంటుంది. ఇందులో 6 డ్రైవ్ మోడ్‌లు లభిస్తాయి. ఇవి కారును గడ్డి, మంచు, బురద, రాళ్ళు, ఇసుకపై కూడా సులభంగా నడపడానికి సాయపడతాయి. ఈ కారు కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం అద్భుతమనే చెప్పాలి. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కి.మీ. రేంజ్ అందిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై దీని మొత్తం రేంజ్ 627 కి.మీ. వరకు ఉంటుంది.

ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. ADAS లెవెల్-2 (Advanced Driver-Assistance Systems Level-2), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్, పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 540 డిగ్రీ వ్యూ (360 డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్ + ట్రాన్స్‌పరెంట్ మోడ్) లభిస్తుంది. ఈ కారులో మొదటిసారిగా శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. ఇందులో 14.53 అంగుళాల హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది కారులో థియేటర్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారులో 502 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది 999 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

Tags: