Tata Motors : 2026లో టాటా మోటార్స్ సిక్సర్..మార్కెట్లోకి రాబోతున్న 6 అదిరిపోయే ఎస్‍యూవీలు ఇవే

మార్కెట్లోకి రాబోతున్న 6 అదిరిపోయే ఎస్‍యూవీలు ఇవే

Update: 2025-12-31 07:33 GMT

Tata Motors : టాటా మోటార్స్ 2025లో తన సత్తా చాటిన తర్వాత, 2026 లో మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది. భారతీయ రోడ్లపై లోహాలట్ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టాటా, వచ్చే ఏడాది ఏకంగా 6 కొత్త ఎస్‍యూవీలను మార్కెట్లోకి వదిలేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. వీటిలో ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ వేరియంట్లు ఉండటంతో కస్టమర్లకు భారీ ఆప్షన్లు లభించనున్నాయి.

టాటా సియెర్రా ఈవీ : 90వ దశకంలో ఒక ఊపు ఊపిన సియెర్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ రాబోతోంది. ఇది 2026 ప్రారంభంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‍యూవీలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. పాత సియెర్రా లుక్స్‌ను మోడరన్ టచ్‌తో తీసుకురావడం దీని ప్రత్యేకత.

హారియర్, సఫారీ పెట్రోల్: చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్లు 2026లో పట్టాలెక్కనున్నాయి. వీటిలో సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఇది 170 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వద్దనుకునే లగ్జరీ కార్ల ప్రియులకు ఇది మంచి ఛాయిస్ అవుతుంది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‍యూవీ పంచ్ వచ్చే ఏడాది కొత్త హంగులతో రాబోతోంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లు రెండింటిలోనూ ఫేస్‌లిఫ్ట్ మార్పులు ఉంటాయి. కొత్త డ్యాష్‌బోర్డ్, 360-డిగ్రీ కెమెరా, లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ముఖ్యంగా పంచ్ ఈవీలో బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచి మరింత ఎక్కువ రేంజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

నెక్సాన్ థర్డ్ జనరేషన్ : టాటాకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన నెక్సాన్ తన మూడవ తరం మోడల్‌తో 2026 చివరలో దర్శనమివ్వనుంది. ప్రాజెక్ట్ గరుడ్ పేరుతో పిలవబడుతున్న ఈ కారు డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఇంజిన్, ప్లాట్‌ఫారమ్‌లో కూడా కీలక మార్పులు ఉండబోతున్నాయి. ఇది టాటాకు మార్కెట్లో మరింత పట్టును తెచ్చిపెట్టడం ఖాయం.

లగ్జరీ సెగ్మెంట్‌లో అవిన్యా : టాటా నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవిన్యా. ఇది జాగ్వార్ ల్యాండ్ రోవర్, EMA ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, ఒక లగ్జరీ లాంజ్ లాగా ఉంటుందని టాటా చెబుతోంది. 2026 చివరి నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన కారు.

Tags:    

Similar News