Tata Harrier EV: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన టాటా హారియర్ ఈవీ రేట్లు
ఈవీ రేట్లు
Tata Harrier EV: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హారియర్ ఈవీ ధరలను తాజాగా సవరించింది. కార్‌వాలే నివేదికల ప్రకారం.. ఈ ఎస్‌యూవీ ధరను రూ.11,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో ధరల పెంపు ఉంటుందని ప్రకటించిన టాటా సంస్థ, ఇప్పుడు హారియర్ ఈవీ విషయంలో ఆ నిర్ణయాన్ని అమలు చేసింది.
వివిధ వేరియంట్లపై పెరిగిన ధరలు
తాజా ధరల పెంపు తర్వాత టాటా హారియర్ ఈవీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.21.79 లక్షలకు చేరుకుంది. వివిధ వేరియంట్ల ఆధారంగా కంపెనీ ధరలను రూ.10,000 నుంచి రూ.11,000 వరకు పెంచింది. ఈ పెంపుదల తరువాత ఈ ఎస్‌యూవీ టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.30.54 లక్షల వరకు పలుకుతోంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే ముందు ఈ కొత్త ధరలను పరిగణలోకి తీసుకోవడం మంచిది.
BaaS ప్రోగ్రామ్‌తో తగ్గే ప్రారంభ ఖర్చు
టాటా మోటార్స్ ఇటీవలే తన మొత్తం ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా వినియోగదారులు కారు ధరను, బ్యాటరీ ధరను వేర్వేరుగా చెల్లించే అవకాశం లభిస్తుంది. ఈ విధానం వల్ల ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే సమయంలో పెట్టాల్సిన ప్రారంభ పెట్టుబడి భారీగా తగ్గుతుంది. బాస్ ప్రోగ్రామ్ కింద హారియర్ ఈవీ ప్రారంభ ధర ఏకంగా రూ.7.30 లక్షలు తగ్గి కేవలం రూ.14.49 లక్షలకే లభిస్తుంది. అయితే దీనికి బదులుగా వినియోగదారులు తాము ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు రూ.5.90 చొప్పున బ్యాటరీ రెంటల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అత్యుత్తమ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
హారియర్ ఈవీలో 75kWh అలాగే 65kWh కెపాసిటీ కలిగిన పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు. సింగిల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లతో వచ్చే ఈ వాహనం 390bhp పవర్, 504Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 627 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 14.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వివిధ టెర్రైన్ మోడ్స్ వంటి ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. త్వరలోనే టాటా సంస్థ నుంచి 'సఫారి ఈవీ' కూడా మార్కెట్లోకి రానుందని సమాచారం.