Tata Motors : టాటా ఈవీల జాతర.. 2026లో రాబోతున్న 3 పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు ఇవే!
2026లో రాబోతున్న 3 పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు ఇవే!
Tata Motors : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2026 సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సరికొత్త విప్లవం సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 2.5 లక్షల ఈవీ విక్రయాలతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న టాటా, వచ్చే ఏడాది ఏకంగా 3 సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ సుమారు 66 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ వరకు అన్ని విభాగాల్లో ఈవీలను అందుబాటులోకి తెచ్చిన ఏకైక సంస్థ ఇదే. ముఖ్యంగా నెక్సాన్ ఈవీ ఇప్పటికే ఒక లక్ష విక్రయాల మైలురాయిని దాటి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీగా నిలిచింది. ఈ జోరును కొనసాగిస్తూ 2030 నాటికి తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది.
1. టాటా సియెర్రా ఈవీ : నవంబర్ 2025లో లాంచ్ అయిన ఐసిఈ వెర్షన్ సియెర్రా తరహాలోనే, దీని ఎలక్ట్రిక్ వెర్షన్ 2026 మొదటి త్రైమాసికంలో (Q1) మార్కెట్లోకి రానుంది. ఇది టాటా అత్యాధునిక Acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండబోతుండటం విశేషం. సుమారు 500 కి.మీ. రేంజ్ ఇచ్చే సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌లతో రాబోతున్న ఈ కారు ధర రూ. 16 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
2. టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన పంచ్ ఈవీ, 2026లో కొత్త హంగులతో రానుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఎక్స్‌టీరియర్ డిజైన్ మార్పులతో పాటు లోపల 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వెన్డిలేటెడ్ సీట్లు, మెరుగైన ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇది కూడా 2026 ప్రథమార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ, రేంజ్ పరంగా ప్రస్తుతం ఉన్న 315 కి.మీ, 421 కి.మీ ఆప్షన్లనే స్వల్ప మెరుగుదలలతో కొనసాగించవచ్చు.
3. టాటా అవిన్యా : టాటా మోటార్స్ నుంచి రాబోతున్న అత్యంత విలాసవంతమైన, హైటెక్ ఈవీ అవిన్యా. ఇది ఒక ప్రత్యేకమైన Gen 3 ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై తయారవుతోంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, ఒక సాఫ్ట్‌వేర్ ఆధారిత ప్రీమియం వెహికల్. దీనిని 2026 చివరి నాటికి ఒక ప్రత్యేక బ్రాండ్ కింద లాంచ్ చేయాలని టాటా ప్లాన్ చేస్తోంది. ఇందులో హై-స్పీడ్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది, అంటే కేవలం 30 నిమిషాల ఛార్జింగ్ తో 500 కి.మీ. ప్రయాణించవచ్చు. దీని ధర రూ. 30 లక్షల పైచిలుకు ఉండే అవకాశం ఉంది.