Tata Punch EV : టాటా పంచ్ ఈవీ 2026 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ఆ 5 భారీ మార్పులు తెలిస్తే ఇప్పుడే బుక్ చేస్తారు
ఆ 5 భారీ మార్పులు తెలిస్తే ఇప్పుడే బుక్ చేస్తారు
Tata Punch EV : టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీని సరికొత్త హంగులతో 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం ఇలా ప్రతి విషయంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ధర విషయంలో టాటా మోటార్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో ఈ కారును కేవలం రూ. 6.49 లక్షలకే (ఎక్స్-షోరూమ్) సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీతో కలిపి పూర్తిగా కొనాలనుకుంటే దీని ప్రారంభ ధర రూ. 9.69 లక్షలుగా ఉంది. మీరు ఈ కొత్త ఈవీని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, అందులో జరిగిన ఆ 5 ప్రధాన మార్పుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
1. అదిరిపోయే కొత్త లుక్
2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్‌గా, ప్రీమియంగా మారింది. ముందు భాగంలో పాత మోడల్‌లో ఉన్న నల్లటి చారను తొలగించి, బాడీ కలర్ ప్యానెల్‌ను అమర్చారు. దీనివల్ల కారు మరింత హుందాగా కనిపిస్తుంది. హెడ్‌లైట్ల అమరికను మార్చడంతో పాటు, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్‌ను ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ సరికొత్త స్టైల్ ఇచ్చారు. పక్కల నుంచి చూస్తే, గాలిని ఎదుర్కోవడంలో మెరుగ్గా పనిచేసే 16-అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ ఆకట్టుకుంటాయి. వెనుక వైపు కూడా కనెక్టెడ్ టెయిల్ లైట్స్ కారుకు మరింత దర్పాన్ని తెచ్చిపెట్టాయి.
2. కొత్త రంగుల సందడి
రంగుల విషయంలో కూడా టాటా మోటార్స్ కస్టమర్లకు కొత్త ఆప్షన్లను ఇచ్చింది. పాత మోడల్‌లో ఉన్న రంగులతో పాటు ఇప్పుడు మరో మూడు ఆకర్షణీయమైన షేడ్స్‌ను జతచేసింది. అవే.. ఫియర్‌లెస్ ఎల్లో, బెంగాల్ రూజ్, కారామెల్. ఇప్పుడు మొత్తం ఏడు రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అందుబాటులో ఉంది. డ్యూయల్ టోన్ ఆప్షన్ల వల్ల యువతను ఈ కారు ఇట్టే ఆకట్టుకుంటోంది.
3. ఇంటీరియర్ ఇప్పుడు ఇంకా లగ్జరీ
కారు లోపలి భాగం (ఇంటీరియర్) పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇందులో 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7.0-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే, టాటా లోగో వెలుగులీనే సరికొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. సెంటర్ కన్సోల్‌లో టచ్ కంట్రోల్స్, రోటరీ డయల్స్ ఉండటంతో పాటు లేదరెట్ సీట్లు కారు లోపల ఒక ప్రీమియం కార్ ఫీల్‌ను కలిగిస్తాయి.
4. అప్‌గ్రేడ్ అయిన ఫీచర్లు
ఫీచర్ల వేటలో పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ అందనంత ఎత్తులో నిలిచింది. ఈ కొత్త మోడల్‌లో కారు ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం ఇచ్చారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రీజనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడల్ షిఫ్టర్లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, కారు చుట్టూ ఉన్న పరిసరాలను చూపే 360-డిగ్రీ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తాయి.
5. పెరిగిన రేంజ్.. పవర్‌ఫుల్ బ్యాటరీ
అన్నింటికంటే ముఖ్యమైన మార్పు బ్యాటరీ, పర్ఫార్మెన్స్‌లో జరిగింది. పాత మోడల్‌లో 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండగా, ఇప్పుడు వాటిని 30 kWh, 40 kWh కి పెంచారు. దీనివల్ల కారు రేంజ్ కూడా భారీగా పెరిగింది. పాత వెర్షన్ 315-421 కిమీ రేంజ్ ఇస్తే, ఈ 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. లాంగ్ జర్నీలు చేసేవారికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు.