Tata Punch EV Facelift : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్లు.. 468 కి.మీ రేంజ్, ధర వింటే షాక్ అవ్వాల్సిందే
468 కి.మీ రేంజ్, ధర వింటే షాక్ అవ్వాల్సిందే
Tata Punch EV Facelift : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీని సరికొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేసింది. ఫిబ్రవరి 20, 2026న లాంచ్ అయిన ఈ కారు, అటు ధరలోనూ ఇటు రేంజ్ విషయంలోనూ వాహనదారులను ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ.9.69 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ రూ.12.59 లక్షల వరకు ఉంది. అయితే, టాటా ప్రవేశపెట్టిన బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ ప్లాన్ ద్వారా కేవలం రూ.6.49 లక్షలకే ఈ కారును సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో బ్యాటరీ అద్దె కింద కిలోమీటరుకు రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే.. కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు తన పెద్దన్నలైన నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీల తరహాలో కనిపిస్తోంది. ముందు భాగంలో వెలిగే లోగోతో కూడిన కొత్త కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. లోపల క్యాబిన్ కూడా చాలా లగ్జరీగా ఉంది. ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫుల్ డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక హంగులు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
బ్యాటరీ, పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు రెండు ఆప్షన్లలో లభిస్తుంది. 30kWh బ్యాటరీ సుమారు 365 కి.మీ రేంజ్ ఇస్తుండగా, పెద్దదైన 40kWh బ్యాటరీ ఏకంగా 468 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నిజజీవితంలో ఇది సుమారు 355 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 26 నిమిషాల్లోనే 20 నుండి 80 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 135 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పైగా బ్యాటరీపై కంపెనీ లైఫ్‌టైమ్ వారంటీని ఆఫర్ చేయడం విశేషం.
సేఫ్టీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను టాటా స్టాండర్డ్‌గా ఇచ్చింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 195 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 450 మిమీ వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉండటం వల్ల గుంతలు, వరద నీరు ఉన్న రోడ్ల మీద కూడా ఈ కారు ధైర్యంగా దూసుకుపోతుంది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈ కారు సిట్రోయెన్ eC3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.