Tata Punch EV vs Citroen eC3 : టాటా పంచ్ ఈవీ vs సిట్రోయెన్ ఈ-సీ3..మధ్యతరగతి జేబుకు ఏది బెటర్?
మధ్యతరగతి జేబుకు ఏది బెటర్?
Tata Punch EV vs Citroen eC3 : కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే, మంచి మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం వెతుకుతుంటే.. మార్కెట్లో టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ ఈ-సీ3 ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఈ రెండింటిలో మీ బడ్జెట్‌కు ఏది సెట్ అవుతుంది? ఫీచర్లు, సేఫ్టీలో ఏది టాప్? అనే పూర్తి పోలిక చూద్దాం.
డిజైన్, లుక్స్: టాటా పంచ్ ఈవీ చూడటానికి చాలా మోడరన్, ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. ఇందులో కొత్త డిజిటల్ ఎల్ఈడి డీఆర్ఎల్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. ఇక సిట్రోయెన్ ఈ-సీ3 విషయానికి వస్తే, ఇది వారి రెగ్యులర్ సి3 మోడల్ లాగే ఉంటుంది. ఇందులో స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్ ఉన్నప్పటికీ, హ్యాలోజన్ బల్బులను వాడారు. పంచ్ ఈవీ కొంచెం ఎత్తుగా, ఎస్‌యూవీ లుక్ తో కనిపిస్తే, సిట్రోయెన్ కొంచెం పొడవుగా ఉంటుంది.
బ్యాటరీ, రేంజ్:
టాటా పంచ్ ఈవీ: ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. 25 kWh బ్యాటరీ (315 కి.మీ రేంజ్), 35 kWh బ్యాటరీ (421 కి.మీ రేంజ్). ఇది లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ కావడంతో వేగంగా ఛార్జ్ అవుతుంది. దీని మోటార్ 120 bhp వరకు పవర్‌ను ఇస్తుంది.
సిట్రోయెన్ ఈ-సీ3: ఇందులో కేవలం 29.2 kWh బ్యాటరీ మాత్రమే ఉంది. ఇది 320 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఎయిర్-కూల్డ్ బ్యాటరీ. దీని మోటార్ 57 bhp పవర్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్ల జాతర: ఫీచర్ల విషయంలో టాటా పంచ్ ఈవీ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇందులో 10.24-ఇంచుల రెండు స్క్రీన్లు, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. సిట్రోయెన్ ఈ-సీ3లో 10.2-ఇంచుల టచ్‌స్క్రీన్ ఉన్నప్పటికీ, వెనుక వైపు పవర్ విండోస్ స్విచ్‌లు డ్రైవర్ పక్కన ఉండటం, మాన్యువల్ ఏసీ వంటి పాత ఫీచర్లు కొన్ని అసౌకర్యంగా అనిపించవచ్చు.
సేఫ్టీలో భారీ తేడా: ఇక్కడ కారు తీసుకునే వాళ్లు కచ్చితంగా గమనించాలి. టాటా పంచ్ ఈవీకి భారత్ ఎన్‌క్యాప్ లో 5-స్టార్ రేటింగ్ వచ్చింది. ఇది అత్యంత సురక్షితమైన కారు. దీనికి భిన్నంగా సిట్రోయెన్ ఈ-సీ3 గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టులో 0-స్టార్ రేటింగ్ సాధించింది. సేఫ్టీ గురించి ఆలోచించే వారికి పంచ్ ఈవీ ఏకైక ఎంపిక.
ధరల వివరాలు:
టాటా పంచ్ ఈవీ ధర: రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల మధ్యలో ఉంది.
సిట్రోయెన్ ఈ-సీ3 ధర: రూ.12.90 లక్షల నుంచి రూ. 13.53 లక్షల మధ్యలో ఉంది. పంచ్ ఈవీ ప్రారంభ ధర తక్కువగా ఉండటం మరియు ఎక్కువ వేరియంట్లలో లభించడం కస్టమర్లకు ప్లస్ పాయింట్.