Tata Sierra EV : 500 కిలోమీటర్ల రేంజ్.. అదిరిపోయే డిజైన్.. టాటా సియెర్రా ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్
టాటా సియెర్రా ఈవీ లాంచ్ డేట్ ఫిక్స్
Tata Sierra EV : టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ సియెర్రాను ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ రోడ్లపైకి తీసుకురావడానికి ముహూర్తం ఖరారు చేసింది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ - జూన్ 2026 మధ్యలో ఈ మోస్ట్ అవేటెడ్ టాటా సియెర్రా ఈవీ మార్కెట్లోకి విడుదల కానుంది. టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో రాబోతున్న ఏడవ వాహనం ఇది. పాత సియెర్రా జ్ఞాపకాలను ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కలిపి టాటా ఈ కారును రూపొందిస్తోంది.
ఈ కారు డిజైన్ విషయానికి వస్తే, పాత ఐసీఈ మోడల్ లాగే ఇది కూడా చాలా శక్తివంతంగా, ధృడంగా కనిపిస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, స్టైలిష్ లైట్ బార్‌తో కూడిన ఫ్లాట్ బంపర్, ఎత్తుగా ఉండే బోనెట్ దీనికి రాజసం తెచ్చిపెడతాయి. అలాగే, గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా డిజైన్ చేసిన కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్, చుట్టూ గ్లాస్ ఫినిషింగ్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
ఇక ఇంజిన్ లేదా పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, సియెర్రా ఈవీలో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. టాటా కర్వ్ ఈవీలో వాడిన 55kWh బ్యాటరీ లేదా హారియర్ ఈవీలో రాబోతున్న 65kWh బ్యాటరీని ఇందులో ఉపయోగించవచ్చు. కర్వ్ ఈవీ బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై సుమారు 502 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని అంచనా. ఒకవేళ హారియర్ ఈవీలోని పెద్ద బ్యాటరీని వాడితే, అది ఏకంగా 538 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుంటుంది. అంటే, లాంగ్ ట్రిప్పులకు కూడా ఈ కారు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ టాటా సియెర్రా ఈవీ.. మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ ZS ఈవీ, మారుతి సుజుకి ఈవీఎక్స్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధరల గురించి అధికారికంగా ప్రకటించనప్పటికీ, ప్రారంభ ధర సుమారు రూ.20 లక్షల నుంచి ఉండవచ్చని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత తరం వారికి సియెర్రా అంటే ఒక ఎమోషన్, కొత్త తరం వారికి అదొక స్టైల్ ఐకాన్. అందుకే ఈ కారు కోసం ఇండియాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.