Tata Sierra : 50 వేల మంది కస్టమర్ల నమ్మకం.. టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్ లాంచ్
టాటా సియెర్రా జూబ్లీ ఎడిషన్ లాంచ్
Tata Sierra :భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ టాటా సియెర్రా దేశీయ మార్కెట్లో 50 వేల యూనిట్ల విక్రయాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో 50 వేల మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నందుకు కృతజ్ఞతగా టాటా మోటార్స్ ఒక అద్భుతమైన జూబ్లీ ఎడిషన్ ను భారత మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది. అయితే, ఇక్కడ కార్ లవర్స్ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది ఎలాంటి కొత్త మోడల్ లేదా కొత్త వేరియంట్ కాదు. ప్రస్తుత మోడళ్లను మరింత స్టైలిష్‌గా మార్చుకోవడానికి కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాక్సెసరీ ప్యాకేజీలను మాత్రమే విడుదల చేసింది.
కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కార్లను పర్సనలైజ్డ్ లుక్‌లో మార్చుకోవడానికి టాటా మోటార్స్ ఈ జూబ్లీ ఎడిషన్ కిట్‌ను సియెర్రాలోని కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు తమ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ పూర్తి ప్యాకేజీని ఒకేసారి కొనుగోలు చేయవచ్చు లేదా అందులోని కొన్ని నచ్చిన యాక్సెసరీలను మాత్రమే విడివిడిగా సెలెక్ట్ చేసుకుని కార్లలో అమర్చుకోవచ్చు. ఈ సరికొత్త ఆప్షన్ వల్ల కారుకు ఒక ప్రీమియం మరియు యూనిక్ లుక్ వస్తుందని కంపెనీ చెబుతోంది. డీలర్ లెవెల్‌లోనే ఈ సరికొత్త యాక్సెసరీలను ఫిట్ చేసుకోవచ్చు.
ఈ స్పెషల్ ఎడిషన్‌లో భాగంగా తీసుకొచ్చిన స్మార్ట్ ప్లస్ జూబ్లీ ఎడిషన్ ప్యాకేజీలో కారు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో చాలా ఆకర్షణీయమైన మార్పులు చేశారు. కారు బయటి వైపు కొత్త ఫ్రంట్ గ్రిల్ గార్నిష్, టెయిల్‌గేట్ క్లాడింగ్, స్టైలిష్ రూఫ్ రెయిల్స్‌ను అందించారు. ఇవి కారుకు మరింత బోల్డ్ లుక్‌ని ఇస్తాయి. ఇక కేబిన్ లోపలి విషయానికి వస్తే.. సెమీ-లెదరెట్ సీట్ కవర్లు, ఫోర్-స్పీకర్ ఆడియో సిస్టమ్, పెద్ద సైజ్ 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వంటి లగ్జరీ ఫీచర్లను జోడించారు. దీంతో పాటు ప్రయాణికుల సేఫ్టీ కోసం రియర్ పార్కింగ్ కెమెరాను కూడా ఇందులో చేర్చారు.
స్మార్ట్ ప్లస్ ప్యాకేజీ కంటే ఎక్కువ ఫీచర్లను కోరుకునే వారి కోసం ప్యూర్ జూబ్లీ ఎడిషన్ ను టాటా మోటార్స్ డిజైన్ చేసింది. ఇందులో ఫ్రంట్ గ్రిల్, టెయిల్‌గేట్ క్లాడింగ్‌తో పాటు అదనంగా వీల్ ఆర్చ్ క్లాడింగ్, పార్సెల్ ట్రే, మ్యాగ్నెటిక్ సన్‌షేడ్స్‌ను అందించారు. కారు ఇంటీరియర్ లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ప్రీమియం లేదరెట్ సీట్ కవర్లు, లేదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్ కవర్‌ను అమర్చారు. వీటన్నింటికీ మించి భద్రతను పటిష్టం చేయడానికి ఈ ప్యాకేజీలో కారుకు ముందు, వెనుక వైపులా రికార్డింగ్ చేసుకునేలా అధునాతన డ్యాష్ కెమెరాను కూడా జత చేశారు.
ఇక రోడ్లపై కాకుండా కొండలు, గుట్టల్లో ఆఫ్-రోడింగ్ చేయడాని ఇష్టపడే, రగ్గడ్ ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ అడ్వెంచర్ జూబ్లీ ఎడిషన్ ను తీసుకువచ్చింది. ఇందులో టాటాకు చెందిన అధికారిక ఆర్ఓక్యూ యాక్సెసరీ కిట్‌ను పొందుపరిచారు. ఇది సియెర్రా కారుకు పక్కా ఆఫ్-రోడ్ స్టైల్‌ను అందిస్తుంది. ఈ ప్యాకేజీతో పాటు కూడా ప్రయాణాలను రికార్డ్ చేయడానికి ఒక క్వాలిటీ డ్యాష్ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. అయితే, టాటా మోటార్స్ ఈ ప్రత్యేక జూబ్లీ ఎడిషన్ ప్యాకేజీల ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కిట్స్ ధరలు, స్టాక్ లభ్యత, ఇన్‌స్టాలేషన్ వివరాల కోసం కస్టమర్లు తమ సమీపంలోని టాటా మోటార్స్ అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.