Tata Sierra : క్రెటాకు గట్టిపోటీ..పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మూడు ఆప్షన్లలో రాబోతున్న టాటా నయా ఎస్‌యూవీ
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మూడు ఆప్షన్లలో రాబోతున్న టాటా నయా ఎస్‌యూవీ
Tata Sierra : టాటా మోటార్స్ నుంచి ఒకప్పుడు మార్కెట్‌లో సంచలనం సృష్టించిన టాటా సియెర్రా ఎస్‌యూవీ త్వరలో భారతీయ రోడ్లపైకి తిరిగి రానుంది. ఈ కారు అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, కంపెనీ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ విభాగంలోకి సియెర్రా మూడు పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ట్రిపుల్ దెబ్బ కొట్టడానికి వస్తోంది.
టాటా మోటార్స్ సియెర్రా ఎస్‌యూవీని మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందించడం ద్వారా మార్కెట్‌లో తన పట్టును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మోడళ్లకు సియెర్రా గట్టి పోటీ ఇవ్వనుంది.
సియెర్రాను పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో లాంచ్ చేయాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. సియెర్రా ఈవీలో హారియర్ ఈవీ నుండి పవర్‌ట్రెయిన్ తీసుకోనే అవకాశం ఉంది. టాటా సియెర్రా డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల వివరాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. డీజిల్ వెర్షన్‌లో హారియర్ నుంచి తీసుకున్న 2.0 లీటర్ క్రయోటెక్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 170 బీహెచ్‌పీ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
పెట్రోల్ వేరియంట్‌ను మొదట్లో కొత్త 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్తో పరిచయం చేయవచ్చు. ఇది ప్రారంభ ధరను తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది. తర్వాత ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మరింత పవర్ఫుల్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తీసుకురాబడుతుంది. ఈ నాలుగు-సిలిండర్ మోటార్ 170 బీహెచ్‌పీ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
కొత్త టాటా సియెర్రా అత్యాధునిక ఫీచర్లు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అనేక అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో మహీంద్రా XEV 9eలో కనిపించిన విధంగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు కూర్చున్న ప్యాసింజర్ కోసం స్పెషల్ డిస్‌ప్లే ఉంటాయి.
లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ఓటీఏ అప్‌డేట్స్, 360-డిగ్రీ కెమెరా, అనేక ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. అధిక వేరియంట్‌ల కోసం AWD (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు ఉండే అవకాశం ఉంది.