Tata Motors : టాటా టియాగో ఈవీ vs టాటా పంచ్ ఈవీ.. రూ.10 లక్షల రేంజ్‌లో ఏది కొంటే బెస్ట్?

రూ.10 లక్షల రేంజ్‌లో ఏది కొంటే బెస్ట్?

Update: 2026-05-30 11:59 GMT

Tata Motors : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ విపరీతంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడంలో టాటా మోటార్స్ తిరుగులేని రారాజుగా నిలిచింది. ఒకవేళ మీ బడ్జెట్ గనుక రూ.10 లక్షల లోపు ఉండి.. ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ ముందుకు రెండు అదిరిపోయే ఆప్షన్లు వస్తాయి. అందులో ఒకటి సరికొత్త అప్‌డేట్లతో వచ్చిన హ్యాచ్‌బ్యాక్ కార్ టాటా టియాగో ఈవీ కాగా, మరొకటి బోల్డ్ లుక్‌తో అలరిస్తున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీ. ఈ రెండూ ఒకే బ్రాండ్ నుంచి వస్తున్నప్పటికీ.. ఫీచర్లు, పవర్, రేంజ్, ధర విషయంలో వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మరి మీ రోజువారీ అవసరాలకు ఈ రెండింటిలో ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో తెలుసుకుందాం.

తక్కువ బడ్జెట్ లోనే లభిస్తున్న టాటా టియాగో ఈవీ!

మొదటగా ధరల విషయానికి వస్తే.. టాటా టియాగో ఈవీ చాలా తక్కువ బడ్జెట్‌కే అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.11.14 లక్షల వరకు ఉంటాయి. కస్టమర్ల కోసం ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను టాటా ఇస్తోంది. బేస్ వేరియంట్లలో 19 kWh బ్యాటరీ ఉండగా, టాప్ మోడళ్లలో 24 kWh బ్యాటరీని ఇచ్చారు. టాటా సంస్థ ఇటీవల సరికొత్త ఫీచర్లు, సరికొత్త స్టైలిష్ కేబిన్‌తో అప్‌డేట్ చేసిన టియాగో ఈవీ 2026 మోడల్‌ను లాంచ్ చేసింది. దీని ప్యూర్ ప్లస్ వేరియంట్ సుమారు రూ.9.49 లక్షల ధరలో ఫీచర్ లోడెడ్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అయితే కంపెనీ బ్యాటరీ సెటప్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో పాత మోడల్ లాగే ఇది కూడా సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 285 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.

భారీ పవర్‌తో వస్తున్న టాటా పంచ్ ఈవీ

ఇక మైక్రో ఎస్‌యూవీ స్టైల్ ఇష్టపడే వారి కోసం వచ్చిన టాటా పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ రూ. 10 లక్షల లోపు బడ్జెట్ రేంజ్‌లో కస్టమర్లకు పంచ్ EV స్మార్ట్ 30 వేరియంట్ లభిస్తుంది. ఇందులో టియాగో కంటే పెద్దదైన 30 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చడం విశేషం. పవర్, టార్క్ విషయానికొస్తే.. పంచ్ ఈవీ ఏకంగా 65 kW పవర్, 154 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సమయంలో టియాగో ఈవీ కేవలం 55 kW పవర్, 114 Nm టార్క్ మాత్రమే ఇస్తుంది. అంటే టియాగోతో పోలిస్తే పంచ్ ఈవీ రోడ్డుపై చాలా పవర్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.

సేఫ్టీలో తోపు..

ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ సేఫ్టీ అనేది అత్యంత కీలకమైన అంశం. వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిలిచినా లేదా వరదలు వచ్చినా బ్యాటరీ పాడవకుండా ఉండటం ముఖ్యం. టాటా పంచ్ ఈవీ బేస్ వేరియంట్ లోనే బ్యాటరీ రక్షణ కోసం కఠినమైన IP67 రేటింగ్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఈ ఫీచర్ వల్ల బ్యాటరీ లోపలికి నీరు, దుమ్ము వెళ్లకుండా గట్టి రక్షణ లభిస్తుంది. అయితే, విచారకరమైన విషయం ఏంటంటే.. రూ.10 లక్షల లోపు బడ్జెట్ లో లభించే టియాగో ఈవీ మోడళ్లలో ఈ తరహా అడ్వాన్స్డ్ IP67 ప్రొటెక్షన్ రేటింగ్ లభించదు.

రేంజ్‎లో పంచ్ ఈవీనే కింగ్

ఎలక్ట్రిక్ కారు కొనేవాళ్లు అడిగే మొదటి ప్రశ్న.. "ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?". ఈ విషయంలో పంచ్ ఈవీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. టాటా పంచ్ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 350 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. కాగా టియాగో ఈవీ కేవలం 285 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తుంది. అయితే రియల్ వరల్డ్ డ్రైవింగ్ కండిషన్స్, ఏసీ వాడకం బట్టి రోడ్డుపై నిజమైన మైలేజ్ కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ లాంగ్ డ్రైవ్స్ చేయాలనుకునే వారికి పంచ్ ఈవీనే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

సైజు పెద్దది.. బూట్ స్పేస్ ఎక్కువ

టాటా పంచ్ ఈవీ కేవలం బ్యాటరీలోనే కాదు, సైజు మరియు ప్రాక్టికాలిటీలో కూడా టియాగో కంటే పెద్దదిగా ఉంటుంది. ఎస్‌యూవీ బాడీ స్టైల్ వల్ల ఇందులో కూర్చోవడానికి మంచి స్పేస్ (లెగ్‌రూమ్, హెడ్‌రూమ్) దొరుకుతుంది. అలాగే లగేజీ పెట్టుకోవడానికి పెద్ద బూట్ స్పేస్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ దీని సొంతం. మన ఊర్లలో ఉండే అడ్డదిడ్డమైన గుంతల రోడ్లు, స్పీడ్ బ్రేకర్లను కారు కింద భాగం తగలకుండా ఈజీగా దాటించాలంటే పంచ్ ఈవీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. లాంగ్ ట్రిప్స్ వేసే కుటుంబాలకు ఇది బాగా సెట్ అవుతుంది.

చివరిగా ఏది కొంటే బెటర్..?

చివరగా తేల్చేది ఏంటంటే.. మీ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి, తక్కువ ధరలోనే ఎక్కువ టెక్నాలజీ ఫీచర్లు, విలాసవంతమైన కేబిన్ లుక్, మరియు సిటీలో రోజువారీ ఆఫీస్ ప్రయాణాల కోసం కారు కావాలనుకుంటే టాటా టియాగో ఈవీ చాలా బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా, మీకు కారు లుక్ పెద్దదిగా ఉండాలి, దమ్మున్న పర్ఫార్మెన్స్ కావాలి, బ్యాటరీ సేఫ్టీతో పాటు లాంగ్ రేంజ్ మైలేజ్, గుంతల రోడ్లను తట్టుకునే సామర్థ్యం కావాలనుకుంటే కళ్ళు మూసుకుని కాస్త అదనపు బడ్జెట్ పెట్టి అయినా టాటా పంచ్ ఈవీని ఎంచుకోవడం వంద శాతం కరెక్ట్ నిర్ణయం.

Tags:    

Similar News