Renault Duster : రూ.10.29 లక్షలకే కొత్త డస్టర్.. క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ ఇచ్చే ఫీచర్లు ఇవే
క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ ఇచ్చే ఫీచర్లు ఇవే
Renault Duster : భారతదేశంలో ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఊపిరి పోసిన ఐకానిక్ కారు రెనాల్ట్ డస్టర్. కొన్నాళ్ల విరామం తర్వాత, మరింత పవర్‌ఫుల్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో ఈ కారు మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మార్చి 2026లో లాంచ్ అయిన ఈ కొత్త జనరేషన్ డస్టర్, తన పాత ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా రూపుదిద్దుకుంది. ఈ కారు తన సెగ్మెంట్లోని ఇతర కార్ల కంటే ఏ విషయాల్లో మెరుగ్గా ఉందో వివరంగా తెలుసుకుందాం.
1. అత్యంత సరసమైన ధర
కొత్త రెనో డస్టర్ ధర రూ.10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, మీరు ముందే R-Pass పొంది ఉంటే, ఈ కారును రూ.10.29 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా (రూ.10.79 లక్షలు), కియా సెల్టోస్ (రూ.10.99 లక్షలు) వంటి కార్లతో పోలిస్తే డస్టర్ ప్రారంభ ధర చాలా తక్కువ. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
2. సెగ్మెంట్లోనే పవర్‌ఫుల్ ఇంజిన్
డస్టర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. అందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ హైలైట్. ఇది మర్సిడెస్ బెంచ్ సహకారంతో రూపొందించబడింది. ఈ ఇంజిన్ ఏకంగా 163 PS పవర్, 280 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కంటే కూడా పవర్‌ఫుల్. దీనివల్ల లాంగ్ రైడ్స్, ఓవర్‌టేకింగ్‌లో ఈ కారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అక్టోబర్ 2026 నాటికి ఇందులో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా రాబోతోంది.
3. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, హ్యాండ్లింగ్
డస్టర్ ఎప్పుడూ తన రైడ్ క్వాలిటీకి పేరుగాంచింది. కొత్త మోడల్ లో 212 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఇది ఈ సెగ్మెంట్లో అత్యుత్తమమైనది. దీనివల్ల ఎంతటి అధ్వాన్నమైన రోడ్లనైనా ఇది సునాయాసంగా దాటేస్తుంది. దీని సస్పెన్షన్ సెటప్ ప్రయాణికులకు కుదుపులు తెలియనివ్వకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే హై స్పీడ్ వద్ద కారు హ్యాండ్లింగ్ కూడా చాలా స్థిరంగా ఉంటుంది.
4. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ
పాత డస్టర్‌లో ఫీచర్లు తక్కువగా ఉండేవన్న విమర్శలకు కంపెనీ ఈసారి చెక్ పెట్టింది. ఇందులో లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, గూగుల్ ఆధారిత 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఫ్రంట్ వెన్టిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 10.25-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఈ కారును మరింత ప్రీమియంగా మార్చాయి.
5. స్టైలిష్, రగ్గడ్ డిజైన్
కొత్త డస్టర్ చూడటానికి చాలా రగ్గడ్, అదే సమయంలో మోడ్రన్‌గా ఉంటుంది. దీని వై-షేప్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ లైట్లు కారుకు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. 18-ఇంచ్ అలాయ్ వీల్స్, భారీ క్లాడింగ్ దీనికి ఒక పక్కా ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తాయి. టాటా సియెర్రా, ఎంజీ ఆస్టర్,హోండా ఎలివేట్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.