Renault Duster : బడ్జెట్ రెడీ చేస్కోండి.. రెనాల్ట్ డస్టర్ కమ్‌బ్యాక్.. ఈసారి 7-సీటర్ అవతార్‌లో!
ఈసారి 7-సీటర్ అవతార్‌లో!;
Renault Duster : భారత మార్కెట్లో ఒకప్పుడు చక్రం తిప్పిన రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ మళ్లీ తిరిగి రాబోతోంది. అయితే, ఈసారి సరికొత్త రూపంలో మరింత పెద్దదిగా, హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. రెనాల్ట్ ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్ గతంలోనే దీనిపై కొన్ని సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఆటోకార్ ఇండియా నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఈ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ నిజంగానే అందుబాటులోకి రానుందని ఖరారైంది. ఇది కేవలం డస్టర్ మాత్రమేనా లేదా బిగ్‌స్టర్ అనే కొత్త పేరుతో వస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఈ కారు రాక పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం. కొత్త డస్టర్‌తో పాటు రెనాల్ట్ మరో కొత్త ఎస్‌యూవీని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు మోడళ్లను పెట్రోల్ ఇంజిన్‌లతో విడుదల చేయవచ్చు.. కానీ అన్నిటికంటే పెద్ద అంచనాలు కొత్త డస్టర్‌పైనే ఉన్నాయి.
కొత్త డస్టర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది ఒక పవర్‌ఫుల్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రాబోతోంది. ఇందులో 1.6-లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 94 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అదనంగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు ఉంటాయి. ఈ మోటార్లకు శక్తినివ్వడానికి 1.2 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగిస్తారు. అంటే, కేవలం పెట్రోల్ ఇంజినే కాకుండా, ఎలక్ట్రిక్ మోటార్లు కూడా కలిసి పని చేస్తాయన్నమాట. దీని ప్రత్యేకత ఏమిటంటే.. కొత్త మోడల్ మల్టీ-మోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.
డస్టర్ హైబ్రిడ్ అతిపెద్ద ప్రయోజనం మైలేజ్. ఇంధనాన్ని ఆదా చేయడానికి, ముఖ్యంగా నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ కారు 80 శాతం వరకు బ్యాటరీ శక్తిని ఉపయోగిస్తుంది. దీని అర్థం, సిటీలో మీరు ఎక్కువగా ఎలక్ట్రిక్ మోటార్‌పై ప్రయాణిస్తారు. దీనివల్ల పెట్రోల్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇది నిజంగా ఇంధన సామర్థ్యంలో ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD)లో అందుబాటులో ఉంటుంది.
కొత్త డస్టర్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై రెనాల్ట్ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే, ప్రస్తుత నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం దీనిని ప్రారంభించే అవకాశం లేదు. అంటే, వచ్చే ఏడాది ప్రారంభంలో (2026) ఇది అమ్మకానికి అందుబాటులోకి వస్తుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ధర విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి వస్తుంది కాబట్టి.. ధర కూడా అదే రేంజ్‌లో ఉండవచ్చు. బడ్జెట్ పరంగా, మార్కెట్ అంచనాల ప్రకారం దీని ప్రారంభ ధర రూ.12 లక్షల నుండి రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
భారతదేశంలో కొత్త డస్టర్ ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజ్జా వంటి 5-సీటర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. అయితే, డస్టర్ 7-సీటర్ ఎస్‌యూవీగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది మారుతి గ్రాండ్ విటారా , కియా సెల్టోస్ , హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి కూడా పోటీ ఇవ్వగలదు. బ్రెజ్జా ప్రస్తుతం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. డస్టర్ హైబ్రిడ్ టెక్నాలజీ, 7-సీటర్ సౌలభ్యంతో వస్తే అది భారతీయ ఎస్‌యూవీ మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.