SUV Sales India : టాటా పంచ్‌కు గట్టి పోటీ.. అమ్మకాలు తగ్గినా టాప్ 5లో నిలిచిన చిన్న ఎస్‌యూవీ!

అమ్మకాలు తగ్గినా టాప్ 5లో నిలిచిన చిన్న ఎస్‌యూవీ!;

Update: 2025-06-07 04:12 GMT

SUV Sales India : భారతీయ కార్ల మార్కెట్‌లో 2025లో ఎస్‌యూవీల (SUV) డిమాండ్ వేగంగా పెరుగుతూనే ఉంది. వినియోగదారుల అభిరుచులు మారడంతో ఈ సెగ్మెంట్ కొత్త శిఖరాలను చేరుకుంది. ఎస్‌యూవీ విభాగంలో చాలా కార్లు ప్రజాదరణ పొందాయి. అయితే, చాలా కాలం తర్వాత టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలోకి వచ్చి మార్కెట్‌ను ఏలేసిన 5 కార్లు ఏవో చూద్దాం. ఈ కార్లు మధ్యతరగతి ప్రజలకు ఫస్ట్ ఆప్షన్ గా మారాయి.

1. మారుతి సుజుకి బ్రెజా

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ బ్రెజా, మే 2025 నెలలో ఎస్‌యూవీ విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ నెలలో దీనికి 15,556 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 10శాతం పెరుగుదల. అంతకు ముందు ఏప్రిల్‌లో బ్రెజా 16,971 యూనిట్లను విక్రయించింది. ఇది 4 మీటర్ల లోపు ఎస్‌యూవీలలో, మొత్తం ఎస్‌యూవీల విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

2. హ్యుందాయ్ క్రెటా

గత నెలలో నంబర్ వన్ స్థానంలో ఉన్న క్రెటా, ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. క్రెటా పెట్రోల్-డీజిల్ మోడల్‌లతో పాటు ఎలక్ట్రిక్ మోడల్ అమ్మకాలను కలిపి మొత్తం 14,860 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల్లో 1.3శాతం వృద్ధి కనిపించింది. హ్యుందాయ్ మొత్తం వాహన అమ్మకాల్లో టాటా మోటార్స్‌ను అధిగమించి నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి తిరిగి రావడంలో క్రెటా ముఖ్యమైన పాత్ర పోషించింది.

3. మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ మే 2025లో 14,401 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత సంవత్సరం మే నెలలో దీని అమ్మకాలు 13,717 యూనిట్లు ఉండగా, ఈసారి అమ్మకాల్లో 5శాతం వృద్ధి కనిపించింది. ఏప్రిల్ 2025లో దీని అమ్మకాలు 15,534 యూనిట్లుగా ఉన్నాయి. మే నెల మహీంద్రా కంపెనీకి బాగా కలిసి వచ్చింది. ఇది భారతదేశంలో రెండో అత్యధికంగా వాహనాలను విక్రయించే కంపెనీగా కొనసాగింది.

4. మారుతి సుజుకి ఫ్రాంక్స్

మారుతికి చెందిన ఫ్రాంక్స్ ఎస్‌యూవీ మే నెలలో 13,584 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఇందులో 7శాతం వృద్ధి కనిపించింది. ఏప్రిల్ 2025లో దీని అమ్మకాలు 14,345 యూనిట్లుగా ఉన్నాయి. బ్రెజా తర్వాత, మారుతి నుండి అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో ఫ్రాంక్స్ రెండో స్థానంలో నిలిచింది.

5. టాటా పంచ్ (Tata Punch)

టాటా పంచ్ ఎస్‌యూవీ మే నెలలో 13,133 యూనిట్ల అమ్మకాలతో టాప్-5 జాబితాలోకి వచ్చింది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాల్లో 31శాతం తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 2025లో కూడా దీని అమ్మకాలు తగ్గి టాప్-5 జాబితా నుంచి బయటికి వెళ్లిపోయింది. ఈసారి పంచ్, నెక్సన్‌ను కేవలం 31 యూనిట్ల తేడాతో వెనక్కి నెట్టి జాబితాలో చోటు దక్కించుకుంది.

ఈ ఐదు ఎస్‌యూవీలు భారత మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజల మొదటి ఎంపికగా నిలుస్తూ, తమ అమ్మకాలతో రికార్డులు సృష్టిస్తున్నాయి.

Tags:    

Similar News