Renault Triber : మారుతి ఎర్టిగాకు చెక్ పెట్టేందుకు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త రెనాల్ట్ ట్రైబర్

మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కొత్త రెనాల్ట్ ట్రైబర్;

Update: 2025-06-17 06:22 GMT

Renault Triber : భారత మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో మారుతి ఎర్టిగా చాలా కాలంగా టాప్‌లో ఉంది. అయితే, ఇప్పుడు ఎర్టిగాకు గట్టి పోటీనిచ్చేందుకు రెనాల్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో రెనాల్ట్ ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త మోడళ్లను, వాటి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా కొత్త జనరేషన్ డస్టర్, దాని 7-సీటర్ వెర్షన్ అయిన బోరియల్ వచ్చే ఏడాది రాబోతున్నాయి. మరోవైపు, ఈ ఏడాది చివరి నాటికి రెనాల్ట్ తమ రెండు పాపులర్ కార్లైన ట్రైబర్, కైగర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను కూడా లాంచ్ చేయనుంది. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

ఇటీవల రెనాల్ట్ ట్రైబర్, కైగర్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మోడల్‌లను ఒకేసారి టెస్టింగ్ సమయంలో కనిపించాయి. దీనితో ఈ రెండు కార్ల లాంచింగ్ 2025 పండుగ సీజన్ లో ఉండవచ్చని స్పష్టమైంది. పండుగల సమయంలో కొత్త కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఇది మంచి సమయం అని రెనాల్ట్ భావిస్తోంది. రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్‌లో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో కొత్త స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్ ఉంటుంది. పై భాగంలో LED DRLs (డేటైమ్ రన్నింగ్ లైట్స్), కింద హెడ్‌ల్యాంప్ యూనిట్ ముందు బంపర్‌లో అమర్చబడి ఉంటాయి. కొత్త గ్రిల్ మరింత సన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.

పెద్ద ట్రెపిజాయిడల్ ఎయిర్ డ్యామ్, రెండు వైపులా రౌండ్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. టెయిల్ గేట్ ఇప్పుడు ముందు కంటే ఫ్లాట్‌గా కనిపిస్తుంది. అలాగే, వెనుక భాగంలో కొత్త టెయిల్ లైట్ క్లస్టర్ ఉంటుంది. అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. కారు ఎత్తును పెంచారు. దీనివల్ల మూడవ వరుసలో కూర్చునే వారికి మెరుగైన హెడ్‌రూమ్ లభిస్తుంది. ఈ మార్పులు ట్రైబర్‌ను కుటుంబ MPVగా ఉపయోగించే వారికి చాలా ఉపయోగపడతాయి.

రెనాల్ట్ కైగర్ లో మెకానికల్‌గా పెద్ద మార్పులు కనిపించవు. కానీ, దాని స్టైలింగ్‌లో మాత్రం కొత్తదనం తీసుకురానున్నారు. ఇప్పటివరకు, ట్రైబర్ కేవలం 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రెనాల్ట్ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ వల్ల ట్రైబర్‌కు మెరుగైన డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ రెండూ లభిస్తాయి. ఇది కారు పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. రెనాల్ట్ తీసుకొస్తున్న ఈ కొత్త ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్, దాని స్టైలిష్ డిజైన్, మెరుగైన లోపలి భాగం, కొత్త ఇంజిన్ ఆప్షన్‌తో మారుతి ఎర్టిగాకు గట్టి పోటీనిస్తుందని ఆశిస్తున్నారు. భారతీయ మార్కెట్‌లో 7 సీటర్ కార్ల విభాగంలో రెనాల్ట్ తన వాటాను పెంచుకోవడానికి ఇది ఒక కీలక అడుగు.

Tags:    

Similar News