Tiago vs WagonR : రూ. 5 లక్షల బడ్జెట్ లో బెస్ట్ కారు ఏది? టియాగో స్టైలా.. వ్యాగన్ ఆర్ మైలేజీయా?
టియాగో స్టైలా.. వ్యాగన్ ఆర్ మైలేజీయా?
Tiago vs WagonR : భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు కార్లంటేనే ప్రాణం. మరీ ముఖ్యంగా బడ్జెట్ ధరలో, మంచి ఫీచర్లు ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో టాటా టియాగో, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మధ్య ఎప్పుడూ పెద్ద యుద్ధమే జరుగుతుంటుంది. సేఫ్టీలో టాటా మొనగాడు అంటే, మైలేజీలో మారుతి కింగ్. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ కారు కొంటే లాభం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ధరల యుద్ధం
ముందుగా జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ధర చూడాలి. టాటా టియాగో బేస్ వేరియంట్ ధర సుమారు రూ.4.57 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్ రూ.7.82 లక్షల వరకు ఉంటుంది. అదే మారుతి వ్యాగన్ ఆర్ ధర రూ.4.98 లక్షల నుంచి ప్రారంభమై రూ.6.94 లక్షల వరకు ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, టియాగో ప్రారంభ ధర వ్యాగన్ ఆర్ కంటే తక్కువగా ఉంది. కాబట్టి బడ్జెట్ తక్కువగా ఉండి, స్టైలిష్ కారు కావాలనుకునే వారికి టియాగో ఒక మంచి ఆప్షన్.
ఫీచర్ల జాతర
ఫీచర్ల విషయానికి వస్తే టాటా టియాగో కొంచెం ముందంజలో ఉంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిస్ప్లే ఆప్షన్, మరియు 8 స్పీకర్ల హర్మాన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్ఎల్స్, ఆటోమేటిక్ ఏసీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు వ్యాగన్ ఆర్ కూడా స్మార్ట్‌ప్లే స్టూడియో, 7 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లను ఇస్తోంది. కానీ, టియాగో ఇచ్చే ప్రీమియం ఫినిషింగ్, టెక్నాలజీ వ్యాగన్ ఆర్‌లో కొంచెం తక్కువగానే కనిపిస్తాయి.
మైలేజీ లెక్కలు
సామాన్యుడికి మైలేజీయే ముఖ్యం. ఇక్కడే మారుతి వ్యాగన్ ఆర్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెర్షన్ ఏకంగా లీటరుకు 25.19 కి.మీ మైలేజీ ఇస్తుండగా, సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 34.05 కి.మీ మైలేజీ ఇచ్చి రికార్డు సృష్టిస్తోంది. ఇక టియాగో పెట్రోల్ లో 19-20 కి.మీ, సీఎన్‌జీలో 26-28 కి.మీ మైలేజీని ఇస్తుంది. అయితే టియాగోలో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే.. సీఎన్‌జీలో కూడా ఆటోమేటిక్ ఆప్షన్ ఉండటం. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లోనే మరే కారులోనూ లేదు.
సేఫ్టీ వర్సెస్ స్పేస్
టాటా టియాగో 4-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది, ఇది ప్రయాణికులకు మంచి భద్రతను ఇస్తుంది. వ్యాగన్ ఆర్ తన టాల్-బాయ్ డిజైన్ వల్ల లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఎత్తుగా ఉండేవారికి వ్యాగన్ ఆర్ సౌకర్యంగా ఉంటుంది. మొత్తానికి, మీకు సేఫ్టీ, ప్రీమియం ఫీచర్లు కావాలంటే టియాగోను, కేవలం మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ చాలు అనుకుంటే వ్యాగన్ ఆర్‌ను ఎంచుకోవచ్చు.