Tire Pressure : టైర్లలో గాలి తక్కువైతే మైలేజీకి దెబ్బే.. సరైన టైర్ ప్రెజర్ ఎందుకు ఉండాలో తెలుసుకోండి

సరైన టైర్ ప్రెజర్ ఎందుకు ఉండాలో తెలుసుకోండి

Update: 2026-04-23 09:06 GMT

Tire Pressure : చాలామంది వాహనదారులు టైర్లలో గాలి తగ్గితే తప్ప బంక్ వైపు చూడరు. కానీ, టైర్లలో గాలి సరైన స్థాయిలో ఉండటం అనేది కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు.. మీ భద్రతకు, వాహనం మైలేజీకి, మీ జేబుకు కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒకే యాక్సిల్ (ముందు రెండు లేదా వెనుక రెండు) మీద ఉండే టైర్లలో గాలి సమానంగా లేకపోతే అది పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్యాలెన్స్డ్ టైర్ ప్రెజర్ అంటే ఏమిటి?

చాలామంది బ్యాలెన్స్ అంటే నాలుగు టైర్లలోనూ ఒకే రకమైన గాలి ఉండాలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కారు మోడల్‌ను బట్టి ముందు టైర్లలో ఒకలా, వెనుక టైర్లలో మరోలా గాలి ఉండవచ్చు. అయితే, ఒకే యాక్సిల్‌పై ఉండే టైర్లు (ఉదాహరణకు ముందు ఎడమ, ముందు కుడి టైర్లు) మాత్రం సమానమైన గాలిని కలిగి ఉండాలి. గాలిలో తేడా ఉంటే కారు ఒకవైపుకు లాగుతున్నట్లు అనిపిస్తుంది, దీనివల్ల డ్రైవింగ్ చేయడం కష్టమవుతుంది.

భద్రతకు ఎందుకు ముఖ్యం?

సరైన టైర్ ప్రెజర్ మీ భద్రతకు ప్రాణం పోస్తుంది. టైర్లలో గాలి అసమానంగా ఉంటే, అత్యవసర సమయాల్లో బ్రేక్ వేసినప్పుడు లేదా మలుపులు తిరిగేటప్పుడు కారు బ్యాలెన్స్ తప్పుతుంది. గాలి తక్కువగా ఉన్నప్పుడు టైర్ రోడ్డుతో ఎక్కువ రాపిడికి గురై వేడెక్కుతుంది. దీనివల్ల హై స్పీడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు టైర్ ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంది.

మైలేజీ, ఖర్చుపై ప్రభావం

టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై టైర్ పట్టు పెరుగుతుంది. దీనివల్ల కారును ముందుకు నడపడానికి ఇంజిన్ మరింత కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. గాలి కొంచెం తక్కువగా ఉన్నా మైలేజీ 2 నుంచి 5 శాతం వరకు తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలంలో మీ పెట్రోల్ ఖర్చును భారీగా పెంచుతుంది.

టైర్ల ఆయుష్షు, సౌకర్యం

గాలి సరిగ్గా లేకపోతే టైర్లు త్వరగా అరిగిపోతాయి. గాలి తక్కువైతే టైర్ అంచులు, గాలి ఎక్కువైతే టైర్ మధ్య భాగం త్వరగా దెబ్బతింటాయి. అలాగే, టైర్ ప్రెజర్ సరిగ్గా లేకపోతే వాహనం సస్పెన్షన్ వ్యవస్థపై భారం పడుతుంది. దీనివల్ల రోడ్డుపై వెళ్లేటప్పుడు కుదుపులు ఎక్కువగా తెలుస్తాయి, ప్రయాణం సౌకర్యవంతంగా ఉండదు.

నిపుణుల సూచనలు

ఎప్పుడైనా టైర్లు చల్లగా ఉన్నప్పుడే (అంటే ప్రయాణం మొదలుపెట్టే ముందు) గాలిని చెక్ చేయించుకోవాలి. కనీసం నెలకు ఒకసారి గాలి లెవల్స్ చూసుకోవడం మంచిది. కారు తలుపు వద్ద లేదా యూజర్ మాన్యువల్‌లో కంపెనీ సూచించిన PSI లెవల్స్ మాత్రమే పాటించండి. వీల్ బ్యాలెన్సింగ్, టైర్ ప్రెజర్ రెండూ వేర్వేరు విషయాలని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News