Upcoming SUVs: కొత్త ఈవీ కారు కొనాలా? మార్కెట్లోకి వస్తున్న 4 క్రేజీ ఎస్‌యూవీలు ఇవే
4 క్రేజీ ఎస్‌యూవీలు ఇవే
Upcoming SUVs: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్, టాటా మోటార్స్, విన్‌ఫాస్ట్, రెనాల్ట్ సంస్థలు నాలుగు కొత్త సబ్-4-మీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఈ కొత్త కార్ల ఫీచర్లు, బ్యాటరీ వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.
1. హ్యుందాయ్ అయోనిక్ పీ
భారత మార్కెట్లో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల విభాగంలో హ్యుందాయ్ కొత్త కారును తీసుకొస్తోంది. ప్రస్తుతం కంపెనీలో HE1i కోడ్‌నేమ్‌తో పిలుస్తున్న ఈ కారుకు భారతీయ రోడ్లపై టెస్టింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ కారును E-GMP(K) ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నారు. బాక్సీ డిజైన్, టాల్-బాయ్ లుక్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ADAS వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో 42kWh, 49kWh లేదా 51.4kWh బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. ఇది పూర్తి ఛార్జ్‌పై 300 నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అంచనా.
2. విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఫేస్‌లిఫ్ట్
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ విన్‌ఫాస్ట్ తమ పాపులర్ VF5 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌లో పరీక్షిస్తోంది. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే ఈ కారు సరికొత్త ఫ్రంట్ డిజైన్, సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా కనిపించనుంది. లోపల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వనున్నారు. ఇందులో 29.6kWh బ్యాటరీతో 260 కిలోమీటర్లు, 37.23kWh బ్యాటరీతో 326 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 134bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.
3. కొత్త తరం టాటా నెక్సాన్ ఈవీ
భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న టాటా మోటార్స్ తమ నెక్సాన్ కారును సరికొత్త జనరేషన్ అవతారంలోకి మార్చబోతోంది. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై దీనిని తయారు చేస్తున్నారు. మొదట పెట్రోల్, డీజిల్ వేరియంట్లను విడుదల చేసి, ఆ తర్వాత కొత్త నెక్సాన్ ఈవీని తీసుకొస్తారు. పోటీదారులకు గట్టి జవాబిచ్చేలా పాత మోడల్ కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్, మరింత శక్తివంతమైన మోటార్‌తో పాటు క్యాబిన్లో కొత్త థీమ్, అధునాతన ఫీచర్లను టాటా అందించనుంది.
4. రెనాల్ట్ బ్రిజర్ ఈవీ
రెనాల్ట్ సంస్థ ఇటీవలే పరిచయం చేసిన సబ్-4-మీటర్ కాన్సెప్ట్ ఎస్యూవీ బ్రిజర్ ను వచ్చే ఏడాది పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనిని మల్టీ-ఎనర్జీ వాహనంగా తీర్చిదిద్దుతున్నారు. అంటే మొదట పెట్రోల్ ఇంజిన్‌తో విడుదల చేసి, ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేస్తారు. రెనాల్ట్ నుంచి రాబోయే ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కారు ఇదే కానుంది. పెట్రోల్ మోడల్ తరహా స్టైలిష్ డిజైన్, ఫీచర్లతో రానున్న ఈ కారు బ్యాటరీ, రేంజ్ వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.