7-Seater Cars : ఫ్యామిలీతో షికారుకు పర్ఫెక్ట్ ఛాయిస్.. అదిరిపోయే కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 ‘7-సీటర్’ కార్లు ఇవే
అదిరిపోయే కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 ‘7-సీటర్’ కార్లు ఇవే
7-Seater Cars : భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం అంటే అది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు లేదా ఎక్కువ మంది సభ్యులున్న వారు 7-సీటర్ కార్లకే మొగ్గు చూపుతారు. అయితే కేవలం సీట్లు ఉంటే సరిపోదు.. అవి ప్రయాణంలో సౌకర్యంగా ఉండాలి, బడ్జెట్‌కు అందాలి. మన దేశంలోని గతుకుల రోడ్లను తట్టుకోవాలి. ఈ అన్ని హంగులతో ప్రస్తుతం మార్కెట్లో దుమ్మురేపుతున్న టాప్ 7-సీటర్ కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఎర్టిగా
భారతదేశంలో 7-సీటర్ కార్ల గురించి మాట్లాడుకుంటే మొదట గుర్తొచ్చే పేరు మారుతి ఎర్టిగా. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇవ్వడం దీని ప్రత్యేకత. కేబిన్ లోపల విశాలమైన స్థలం ఉంటుంది. రెండో వరుస సీట్లను మనం కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీనివల్ల కాళ్ళకు తగినంత ఖాళీ దొరుకుతుంది. సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా ఈ కారు అలసటను రానివ్వదు. సర్వీసింగ్ ఖర్చులు కూడా తక్కువ కావడంతో సామాన్యులకు ఇది మొదటి ఛాయిస్.
కియా క్యారెన్స్
ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం కియా క్యారెన్స్ అద్భుతమైన ఆప్షన్. దీని బేస్ వేరియంట్ అయిన స్టాండర్డ్ లో కూడా సీట్లు చాలా మెత్తగా, సౌకర్యవంతంగా ఉంటాయి. మూడవ వరుస సీట్లలో కూడా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. ఇక ఫీచర్లు ఎక్కువగా కావాలనుకునే వారు క్లావిస్ మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయి. రెండో వరుస సీట్లను సులభంగా మడతపెట్టే ఆప్షన్ ఉండటం వల్ల వెనుక సీట్లలోకి వెళ్లడం చాలా ఈజీ.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్
ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ నుంచి వచ్చిన ఎయిర్‌క్రాస్ ఎక్స్ దాని సస్పెన్షన్ సిస్టమ్‌కు పెట్టింది పేరు. రోడ్డు మీద గుంతలు ఉన్నా లోపల కూర్చున్న వారికి పెద్దగా తెలియదు. దీని సీట్లు చాలా వెడల్పుగా ఉండి, వెన్నుకు మంచి సపోర్ట్ ఇస్తాయి. ఈ కారులో ఉన్న మరో గొప్ప ఫీచర్ ఏంటంటే.. అవసరం లేనప్పుడు మూడవ వరుస సీట్లను పూర్తిగా తీసివేయవచ్చు. దీనివల్ల లగేజీ పెట్టుకోవడానికి భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్
మురికి రోడ్లు, కొండ ప్రాంతాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించాలంటే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కు మించినది లేదు. దీని బండ లాంటి బాడీ, పవర్‌ఫుల్ ఇంజిన్ ఎలాంటి కఠినమైన దారినైనా సులువుగా దాటేస్తుంది. కారు ఎత్తుగా ఉండటం వల్ల డ్రైవర్ కు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. భారీ కేబిన్, గంభీరమైన లుక్ దీనికి ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. పల్లెటూరి దారులైనా, పట్నం ట్రాఫిక్ అయినా స్కార్పియో ఎప్పుడూ నెంబర్ వన్.
మీరు బడ్జెట్, మైలేజీని చూస్తుంటే ఎర్టిగా, లగ్జరీ, ఫీచర్లు కావాలంటే క్యారెన్స్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ కోసం ఎయిర్‌క్రాస్, పవర్ కోసం స్కార్పియోను ఎంచుకోవచ్చు. ఈ ఐదు కార్లు కూడా భారతీయ రోడ్లపై తమ సత్తా చాటుతున్నవే.