Compact SUVs: లగేజ్ ఎంతైనా సరే నిరభ్యంతరంగా సర్దేయొచ్చు.. భారీ బూట్ స్పేస్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే
భారీ బూట్ స్పేస్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే
Compact SUVs: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్, తక్కువ ధర ఇందుకు ప్రధాన కారణాలు. అయితే ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే కుటుంబాలకు, ఎక్కువ లగేజ్ తీసుకెళ్లే వారికి కారులోని బూట్ స్పేస్ అత్యంత కీలకమైన అంశం. మీ బడ్జెట్ రూ. 8 లక్షల ఆమోదయోగ్యమైన పరిధిలో ఉంటూ, 350 లీటర్ల కంటే ఎక్కువ లగేజ్ స్పేస్ ఇచ్చే 5 ప్రముఖ కార్ల వివరాలు పరిశీలిద్దాం.
1. స్కోడా కైలాక్ - 446 లీటర్ల భారీ స్పేస్:
ఈ లిస్ట్‌లో అత్యంత ఎక్కువ బూట్ స్పేస్ ఇస్తున్న కారు స్కోడా కైలాక్. ఇందులో ఏకంగా 446 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. దీనిలో 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 113 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.59 లక్షలుగా ఉంది.
2. కియా సైరోస్ - 390 లీటర్ల స్పేస్:
కియా నుంచి వచ్చిన సైరోస్ ఒక ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇందులో 390 లీటర్ల బూట్ సామర్థ్యం ఇచ్చారు. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (118.3 bhp, 172 Nm) మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ (114.4 bhp, 250 Nm) ఇంజిన్ వెర్షన్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.41 లక్షలు.
3. టాటా నెక్సాన్ - 382 లీటర్ల స్పేస్:
భారతదేశంలో అత్యంత సురక్షితమైన, పాపులర్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి. ఇందులో 382 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ఉంటుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లతో మ్యాన్యువల్, AMT, DCT గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.39 లక్షలు.
4. హ్యుందాయ్ వెన్యూ - 375 లీటర్ల స్పేస్:
హ్యుందాయ్ వెన్యూ నగర ప్రయాణాలకు, లాంగ్ రైడ్లకు ఎంతో అనుకూలమైన కారు. ఇందులో 375 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వెర్షన్లలో లభ్యమవుతోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షలు.
5. మహీంద్రా XUV 3XO - 364 లీటర్ల స్పేస్:
మహీంద్రా నుంచి వచ్చిన పవర్‌ఫుల్ మోడల్ XUV 3XO. ఇది 364 లీటర్ల బూట్ స్పేస్‌తో లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ (300 Nm టార్క్) ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.79 లక్షలు. మీరు గనుక ప్రయాణాలు ఎక్కువ చేసే వారైతే స్కోడా కైలాక్, కియా సైరోస్, టాటా నెక్సాన్ అత్యుత్తమ ఎంపికలుగా నిలుస్తాయి.