Toyota Glanza: లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, కొత్త ఇంజిన్‌తో వచ్చేస్తున్న టయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్
టయోటా కొత్త హ్యాచ్‌బ్యాక్
Toyota Glanza: ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ టయోటా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తన హవా సాగించడానికి సిద్ధమైంది. అక్టోబర్ 14న కంపెనీ తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అప్డేటెడ్ మారుతి సుజుకి బలెనో తరహాలోనే, ఈ కొత్త గ్లాంజా మోడల్లో కూడా మైలేజ్, సేఫ్టీ మరియు డిజైన్ పరంగా ఐదు ప్రధాన మార్పులను జోడించారు. పండుగ సీజన్లో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది.
డిజైన్‌లో సరికొత్త మార్పులు
టయోటా గ్లాంజా మోడల్ మారుతి సుజుకి బలెనో ప్లాట్‌ఫారమ్‌పైనే ఆధారపడి రూపుదిద్దుకుంది. అందువల్ల బాహ్య రూపంలో కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేశారు. ఫ్రంట్ డిజైన్‌లో భాగంగా గ్రిల్ నిర్మాణం మారింది. బాలెనో తరహాలోనే టయోటా లోగో ఇప్పుడు బోనెట్ ముందు భాగంలో మెరవనుంది. అంతేకాకుండా సరికొత్త గ్రిల్, దాని చుట్టూ సిల్వర్ ట్రిమ్, కొత్త బంపర్ అమర్చారు. పాత రౌండ్ ఫాగ్ లైట్ల స్థానంలో రెక్టాంగ్యులర్ ఫాగ్ లైట్లు, దిగువన హెక్సాగోనల్ ఎయిర్ ఇంటేక్ ప్యాటర్న్ ఇచ్చి కారుకు మరింత స్పోర్టీ లుక్ తీసుకువచ్చారు.
మోడ్రన్ ఫీచర్లు, లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ
కొత్త గ్లాంజా కేబిన్ లేఅవుట్ లేయర్డ్ డాష్‌బోర్డ్, ఫిజికల్ కంట్రోల్స్, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌తో ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. దీని టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూలింగ్ ప్యాడ్‌తో కూడిన వైర్లెస్ ఛార్జింగ్, మెరుగైన ఆడియో సిస్టమ్ అందించే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కారులో లెవెల్-2 ఏడీఏఎస్ (ADAS) భద్రతా సాంకేతికతను అందించడం అతిపెద్ద అప్డేట్గా నిలుస్తోంది. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్ వంటి కీలక భద్రతా ఫీచర్లు లభిస్తాయి. వీటికి తోడు 360 డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి.
సరికొత్త ఇంజిన్.. మెరుగైన మైలేజ్
పనితీరు విషయానికి వస్తే, కొత్త గ్లాంజాలో పాత 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో మారుతి సుజుకికి చెందిన సరికొత్త 1.2 లీటర్, 3-సిలిండర్ Z12E ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఈ ఇంజిన్ 83 hp పవర్, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత K-సిరీస్ ఇంజిన్‌తో పోలిస్తే పవర్ స్వల్పంగా తగ్గినా, ఇంధన పొదుపు (ఫ్యూయల్ ఎఫిషియెన్సీ) విషయంలో ఇది మెరుగైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ గియర్ బాక్స్ ఆప్షన్లతో పాటు సీఎన్జీ వెర్షన్ కూడా లభించనుంది.