Toyota Hyryder vs Maruti Grand Vitara : టయోటా హైరైడర్ VS మారుతి గ్రాండ్ విటారా.. ఏ SUV బెస్ట్?
ఏ SUV బెస్ట్?
Toyota Hyryder vs Maruti Grand Vitara : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ విపరీతంగా ప్రజాదరణ పొందుతోంది. ఫీచర్లు, మైలేజ్, ధర వంటి అంశాలు కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ విభాగంలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా రెండూ అత్యంత పోటీని ఇస్తూ, తమ శక్తివంతమైన ఇంజన్లు, మంచి మైలేజ్, ప్రీమియం ఫీచర్ల కారణంగా ప్రసిద్ధి చెందాయి. ఈ రెండింటిలో దేనిని కొనుగోలు చేయాలనే గందరగోళంలో ఉన్నవారు వాటి మధ్య ఉన్న పూర్తి వివరాలు, తేడాల గురించి తెలుసుకుందాం.
పెర్ఫార్మెన్స్, మైలేజ్
ఈ రెండు ఎస్‌యూవీలలో ఇంజన్ స్పెసిఫికేషన్లు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. టయోటా హైరైడర్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 92.45 PS పవర్, 122–136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 19.39కిమీ నుంచి గరిష్టంగా 28కిమీ మైలేజ్ ఇస్తుంది. మారుతి గ్రాండ్ విటారాలో కూడా 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 92.45 PS నుంచి 103.06 PS పవర్, 122–136.08 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 19.38 కిమీ నుంచి 27.97 కిమీ వరకు ఉంటుంది. ఫ్యూయల్ ఆప్షన్ల పరంగా చూస్తే, గ్రాండ్ విటారా పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ అనే మూడు ఆప్షన్లలో లభిస్తుంది కాబట్టి ఆప్షన్ల విషయంలో ఇది మెరుగ్గా ఉంటుంది. అయితే మైలేజ్ విషయంలో మాత్రం హైరైడర్ హైబ్రిడ్ సిస్టమ్ అత్యుత్తమ మైలేజ్(సుమారు 28కిమీ) అందిస్తుంది.
ప్రీమియం ఫీచర్లు, టెక్నాలజీ
ఫీచర్ల పరంగా రెండు ఎస్‌యూవీలు చాలా దగ్గరగా ఉన్నాయి. రెండింటిలోనూ పనోరమిక్ సన్‌రూఫ్, 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వెంట్లేటెడ్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ముఖ్యమైన ఫీచర్లు లభిస్తాయి. అయితే కొన్ని అదనపు ఆకర్షణలు ఉన్నాయి. హైరైడర్ క్యాబిన్ మరింత ప్రీమియంగా అనిపిస్తుంది. ఆర్కిమిస్ సౌండ్ సిస్టమ్, క్యాబిన్లో ఉండే యాంబియంట్ లైటింగ్ అదనపు ఆకర్షణలు. మరోవైపు గ్రాండ్ విటారాలో సుజుకి కనెక్ట్ వంటి కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు స్పోర్టీ డ్రైవింగ్ కోసం ప్యాడిల్ షిఫ్టర్లు వంటి అదనపు కంఫర్ట్ ఫీచర్లు లభిస్తాయి.
ధర, వాల్యూ ఫర్ మనీ
ధర విషయంలో రెండు ఎస్‌యూవీలు దాదాపు సమానంగా పోటీ పడుతున్నాయి. టయోటా హైరైడర్ ధర రూ.10.95 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.76 లక్షల వరకు ఉండగా, మారుతి గ్రాండ్ విటారా ప్రారంభ ధర రూ.10.77 లక్షలు, టాప్ మోడల్ రూ.19.72 లక్షలు వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ ధరలో గ్రాండ్ విటారా కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల కొంచెం వాల్యూ ఫర్ మనీగా కనిపిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే ఎక్కువ ఫ్యూయల్ ఆప్షన్స్ (CNG, పెట్రోల్, హైబ్రిడ్), కొంచెం తక్కువ బేస్ ధర కావాలనుకుంటే గ్రాండ్ విటారా మంచిది. అదే స్వల్పంగా మెరుగైన మైలేజ్ (28కిమీ)తో పాటు అత్యంత ప్రీమియం క్యాబిన్ అనుభవాన్ని కోరుకుంటే హైరైడర్‌ను ఎంచుకోవచ్చు. ఫీచర్లు, టాప్-ఎండ్ ధరలు దాదాపు సమానంగా ఉండటం వలన, వినియోగదారులకు ఏ ఆప్షన్ (CNG లేదా హైబ్రిడ్ మైలేజ్) ఎక్కువ ముఖ్యమో దాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.