Toyota Innova: రూ.19.99లక్షలకే దేశంలోనే తొలి ఫ్లెక్స్ హైబ్రిడ్ కారు.. 22.58 కిమీ మైలేజీతో ఇన్నోవా అదుర్స్
| 22.58 కిమీ మైలేజీతో ఇన్నోవా అదుర్స్
Toyota Innova: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త విప్లవానికి తెరలేపింది. కంపెనీ తన పాపులర్ ఎంపీవీ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కారుగా ఇది మార్కెట్లోకి అడుగుపెట్టింది. సాధారణ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.19.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఫ్లెక్స్ హైబ్రిడ్ మోడల్ ధర రూ.19.99 లక్షల నుంచే మొదలవుతోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ తర్వాత E85 ఇంధనంపై నడిచే అరుదైన కార్ల జాబితాలో ఇన్నోవా హైక్రాస్ చేరింది.
డిజైన్‌లో కొత్త మార్పులు ఇవే..కొత్త ఇన్నోవా హైక్రాస్ ముందు, వెనుక భాగాల్లో కంపెనీ ఆకర్షణీయమైన మార్పులు చేసింది. ముందు భాగంలో టయోటా టైజర్ తరహా ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్లతో కూడిన కొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు అమర్చారు. దీనికి తోడు టయోటా హైలక్స్ నుంచి ప్రేరణ పొందిన వెడల్పాటి బాక్సీ గ్రిల్, డైమండ్ ఆకారపు ఎయిర్ ఇన్లెట్స్ కారుకు రఫ్ అండ్ టఫ్ లుక్ ఇస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ స్థానం మార్చడంతో పాటు బంపర్ కింద సిల్వర్ ఫినిష్ స్ట్రిప్ జోడించారు. సైడ్ ప్రొఫైల్ పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ, వెనుక వైపు డబుల్-స్టాక్డ్ టెయిల్లైట్లు, రీడిజైన్ చేసిన కొత్త బంపర్ కనిపిస్తాయి. ఈ కారు సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, బ్లాకిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.
వేరియంట్ల వారీగా ధరల వివరాలుకంపెనీ ఈ కారును G, GX, VX, ZX అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ కేవలం GX వేరియంట్లో మాత్రమే లభిస్తుండగా, మిగిలినవన్నీ ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌తో వస్తున్నాయి.
- G (స్ట్రాంగ్ హైబ్రిడ్): రూ.19.99 లక్షలు
- GX (పెట్రోల్): రూ.19.59 లక్షలు
- GX (స్ట్రాంగ్ హైబ్రిడ్): రూ.23.99 లక్షలు
- VX (స్ట్రాంగ్ హైబ్రిడ్): రూ.28.79 లక్షలు
- ZX (స్ట్రాంగ్ హైబ్రిడ్): రూ.31.99 లక్షలు
(గమనిక: ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరలు. 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.)
క్యాబిన్లో భారీ స్క్రీన్, లగ్జరీ ఫీచర్లు
కారు లోపలి భాగానికి కొత్త అప్హోల్స్టరీతో ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు. ఇందులో ప్రధాన ఆకర్షణ 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీనితో పాటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు, రెండో వరుసలో పవర్డ్ ఒట్టోమన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, సబ్‌వూఫర్‌తో కూడిన 9-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇచ్చారు. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడాస్ ఆధారిత టయోటా సేఫ్టీ సెన్స్ టెక్నాలజీని అందించారు. ఇందులో ప్రీ-కొలిజన్ బ్రేకింగ్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ట్రేస్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
E85 ఇథనాల్ ఇంధనంతో 22.58 కి.మీ మైలేజీకొత్త ఇన్నోవా హైక్రాస్లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్, e-CVT గేర్‌బాక్స్ జతచేశారు. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి 197 hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు లీటరుకు ఏకంగా 22.58 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని టయోటా ప్రకటించింది. డ్రైవింగ్ అనుభూతి కోసం నార్మల్, ఎకో, పవర్ అనే మూడు మోడ్స్ ఇచ్చారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కారణంగా ఈ కారు E20 పెట్రోల్‌తో పాటు E85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) ఇంధనంతోనూ సులభంగా నడుస్తుంది. భవిష్యత్తు ఇంధన అవసరాలకు తగ్గట్టుగా ఈ కారును రూపొందించడం విశేషం.