Toyota Land Cruiser FJ : థార్, జిమ్నీలకు చుక్కలే.. టయోటా నుంచి అదిరిపోయే ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ

టయోటా నుంచి అదిరిపోయే ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ

Update: 2026-05-16 10:54 GMT

Toyota Land Cruiser FJ : ఆఫ్ రోడ్ కార్లంటే పిచ్చి ఉన్నవారికి ల్యాండ్ క్రూజర్ అంటే ఒక ఎమోషన్. కానీ దాని భారీ ధర కారణంగా చాలా మందికి అది ఒక కలగానే మిగిలిపోయేది. అయితే, జపాన్ దిగ్గజం టయోటా ఇప్పుడు ఆ కలను సాకారం చేసే పనిలో పడింది. తన పాపులర్ ల్యాండ్ క్రూజర్ సిరీస్‌లో ఒక చిన్న ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్ జె. జపాన్‌లో తాజాగా విడుదలైన ఈ కారు త్వరలోనే భారత రోడ్లపై గర్జించేందుకు సిద్ధమవుతోంది. భారీ సైజు ల్యాండ్ క్రూజర్‌లతో పోలిస్తే ఇది చిన్నదే అయినా దీని లుక్, పవర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి.

ఈ ల్యాండ్ క్రూజర్ ఎఫ్ జె డిజైన్ చాలా గంభీరంగా, బాక్సీ షేప్‌లో ఉంటుంది. పాతకాలపు ఎఫ్ జె40 ల్యాండ్ క్రూజర్ ఛాయలు ఇందులో కనిపిస్తాయి. దీని ఫ్రంట్ గ్రిల్, గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ దీనికి ఒక రెట్రో లుక్‌ను ఇస్తున్నాయి. అదే సమయంలో ఇది మోడ్రన్ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, వెడల్పుగా ఉండే వీల్ ఆర్చెస్ చూస్తుంటే ఇది ఎంతటి కఠినమైన దారిలనైనా సులువుగా దాటేస్తుందని అర్థమవుతుంది. ముఖ్యంగా దీని బంపర్లను అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే సదుపాయం ఉండటం ఆఫ్-రోడర్లకు పెద్ద ప్లస్ పాయింట్.

పెర్ఫార్మెన్స్ విషయంలో టయోటా ఎక్కడా తగ్గలేదు. ఇందులో 2.7 లీటర్ల శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 163 హార్స్‌పావర్ శక్తిని, 246Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) సిస్టమ్ దీనికి అదనపు బలం. అంటే బురద రోడ్లు, ఇసుక తిన్నెలు లేదా ఎత్తైన కొండలు.. దేనినైనా ఇది అవలీలగా అధిగమిస్తుంది. కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, సిటీ డ్రైవింగ్‌కు కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

బయట రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, లోపల మాత్రం లగ్జరీ కార్లకు పోటీ ఇస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద సైజు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడకుండా టయోటా సేఫ్టీ సెన్స్ టెక్నాలజీని అందించారు. దీనివల్ల అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు డ్రైవర్‌కు రక్షణగా ఉంటాయి. లాంగ్ ట్రిప్పులకు వెళ్లే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ అని చెప్పొచ్చు.

ధర విషయానికి వస్తే, జపాన్ మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ. 27 లక్షల (భారత కరెన్సీ ప్రకారం) వరకు ఉంది. ఒకవేళ టయోటా కంపెనీ మహారాష్ట్రలో నిర్మిస్తున్న తన కొత్త ప్లాంట్‌లో దీనిని తయారు చేస్తే, ఇండియాలో కూడా ఇదే రేంజ్‌లో ధర ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా, మారుతి జిమ్నీ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురవుతుంది. బ్రాండ్ వాల్యూతో పాటు టయోటా ఇచ్చే భరోసా ఈ కారును ఇండియన్ మార్కెట్లో బ్లాక్ బస్టర్ హిట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News