Toyota Rumion : టయోటా రూమియన్ ప్రభంజనం..ఫ్యామిలీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డు
ఫ్యామిలీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డు
Toyota Rumion : భారతీయ రోడ్లపై ఫ్యామిలీ కార్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ విభాగంలో టయోటా రూమియన్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మారుతి ఎర్టిగాకు గట్టి పోటీ నిస్తూ లాంచ్ అయిన కేవలం 32 నెలల్లోనే 50 వేల మైలురాయిని దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. టయోటా బ్రాండ్ వాల్యూ, తక్కువ ధర కలగలిసి రావడంతో కస్టమర్లు ఈ ఎంపీవీ వైపు క్యూ కడుతున్నారు. టయోటా రూమియన్ 2023, ఆగస్టు 10న భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మార్చి 2026 నాటికి మొత్తం 52,271 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కేవలం 32 నెలల కాలంలోనే 50 వేల మార్కును దాటడం అంటే సామాన్యం కాదు. గతేడాది (FY2025)లో ఏకంగా 266 శాతం వృద్ధిని సాధించి, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సంస్థలో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.
ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా మొదలైన రూమియన్ ప్రయాణం, ఆ తర్వాత ఊపందుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5,973 యూనిట్లు అమ్ముడవ్వగా, 2025లో ఆ సంఖ్య 21,878కి చేరింది. ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో 24,420 యూనిట్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 ఎంపీవీల జాబితాలో రూమియన్ చోటు సంపాదించుకుంది. ఈ లిస్టులో మారుతి ఎర్టిగా, ఇన్నోవా హైక్రాస్, కియా కారెన్స్ వంటి దిగ్గజాలతో ఇది పోటీ పడుతోంది.
మారుతి సుజుకి, టయోటా మధ్య ఉన్న ఒప్పందంలో భాగంగా ఎర్టిగాను రీ బ్యాడ్జ్ చేసి రూమియన్ గా తీసుకువచ్చారు. అందుకే ఇది చూడటానికి ఎర్టిగా లాగే ఉన్నా, టయోటా తనదైన శైలిలో కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా ఇన్నోవాను పోలిన ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. లోపల బ్లాక్ డ్యాష్ బోర్డ్, వుడ్ ఫినిషింగ్ తో ఇంటీరియర్ చాలా రిచ్ గా ఉంటుంది.
రూమియన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని ధర. దీని ప్రారంభ ధర రూ.9.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.13.96 లక్షల వరకు ఉంటుంది. ఇది టయోటా నుంచి వస్తున్న అత్యంత చౌకైన 7-సీటర్ కారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 103hp పవర్ ఇస్తుంది. మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ సుమారు 20.51 km/l మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ (CNG) వేరియంట్ ఏకంగా 26.11 km/kg మైలేజీని అందిస్తోంది. 6 ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఫ్యామిలీస్ కి భరోసానిస్తున్నాయి.