Toyota India: టయోటా అదిరిపోయే ప్లాన్.. భారత మార్కెట్లోకి 5 కొత్త కార్లు
భారత మార్కెట్లోకి 5 కొత్త కార్లు
Toyota India: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించేందుకు టయోటా సంస్థ సంచలన వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాబోయే రెండు మూడేళ్లలో 5 సరికొత్త కార్లను దేశీయ మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో హ్యాచ్‌బ్యాక్, హైబ్రిడ్ ఎమ్‌పీవీతో పాటు సరికొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉండటం కార్ల ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయుల ఆదరణ పొందిన ఇన్నోవా హైక్రాస్ కార్లలో కొత్త మార్పులు రానున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 2027 ప్రారంభంలో రోడ్లపైకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్స్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో క్యాబిన్ డిజైన్‌ను ఆధునీకరించనున్నారు. అయితే ఇంజిన్ విభాగంలో పాత 2.0 లీటర్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లనే కొనసాగించే అవకాశం ఉంది. ఇక గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2026 చివరి నాటికి విడుదల కానుంది. టయోటా సొంత గుర్తింపు స్పష్టంగా కనిపించేలా రూపుదిద్దుకుంటున్న ఈ కారులో హైబ్రిడ్ టెక్నాలజీ, అడాస్ సేఫ్టీ ఫీచర్లు తోడవుతున్నాయి.
దేశంలో తొలి 3-రో ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ
టయోటా తన తొలి 3-రో ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీని భారత్‌లో విడుదల చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. మారుతి వైఎమ్‌సీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ కారు 2027-28 నాటికి అందుబాటులోకి రావచ్చు. టయోటా వెల్‌ఫైర్ కన్నా తక్కువ ధరకు, ఇన్నోవా సిరీస్ సరసన దీనిని నిలబెట్టనున్నారు. మార్కెట్‌లో బివైడి ఇమ్యాక్స్ 7 వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తూ, టయోటా నుంచి వచ్చే అత్యంత చౌకైన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించనుంది.
నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ గ్రాండ్ ఎంట్రీ
ఎస్యూవీ ప్రపంచంలో తిరుగులేని రాజసంతో వెలిగిపోతున్న ఫార్చ్యూనర్ మూడో తరం కారు 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభంలో సందడి చేయనుంది. మరింత బాక్సీ డిజైన్, అడ్వాన్స్డ్ అడాస్ సేఫ్టీ ఫీచర్లతో ఇది రూపొందుతోంది. నూతన లేడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే ఈ మోడల్‌లో 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. డీజిల్ ఇంజిన్‌తో పాటు 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించడం ద్వారా మెరుగైన మైలేజ్ సాధించాలని కంపెనీ భావిస్తోంది.
ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే సర్ప్రైజ్
ల్యాండ్ క్రూజర్ సిరీస్‌లోనే చిన్న పరిమాణంలో ఉండే ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే ఎస్యూవీ 2028 చివరి నాటికి భారత రోడ్లపైకి రానుంది. ఈ మోడల్‌లో డీజిల్ ఇంజిన్ లేకుండా 163 బిహెచ్‌పి పవర్ ఇచ్చే 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ జత చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్లలో కూడా దీనిని తీసుకురావడంపై కంపెనీ విస్తృతంగా ఆలోచిస్తోంది.
పెట్రోల్, హైబ్రిడ్, ఈవీ విభాగాల్లో టయోటా తీసుకోబోతున్న ఈ దూకుడు నిర్ణయాలు భారత ఆటోమొబైల్ రంగాన్ని మరో మలుపు తిప్పడం ఖాయం. కొత్త సాంకేతికతతో రానున్న ఈ కార్ల కోసం కొనుగోలుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.