Toyota Urban Cruiser EV : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిమీ..టయోటా తొలి ఈవీ అర్బన్ క్రూజర్ వచ్చేస్తోంది
టయోటా తొలి ఈవీ అర్బన్ క్రూజర్ వచ్చేస్తోంది
Toyota Urban Cruiser EV : జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా, ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. తన తొలి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూజర్ ఈవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటిదాకా పెట్రోల్, హైబ్రిడ్ కార్లతో భారతీయుల మనసు గెలుచుకున్న టయోటా, ఇప్పుడు ఈవీ సెగ్మెంట్‌లో కూడా సత్తా చాటాలని చూస్తోంది. ముఖ్యంగా త్వరలో రాబోతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీకి ఇది గట్టి పోటీ ఇవ్వబోతోంది.
మారుతి సుజుకి, టయోటా మధ్య ఉన్న భాగస్వామ్యంలో భాగంగా వస్తున్న సరికొత్త మోడలే ఈ అర్బన్ క్రూజర్ ఈవీ. మారుతి సుజుకి త్వరలో లాంచ్ చేయబోతున్న ఈ-విటారాకి ఇది రీ-బ్యాడ్జ్ వెర్షన్. గతంలో గ్లాంజా-బాలెనో, రుమియన్-ఎర్టిగా, అర్బన్ క్రూజర్ హైరైడర్-గ్రాండ్ విటారా జంటల్లాగే.. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిసి ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ప్రకారం.. ఈ కారు డిజైన్ గత ఏడాది ఆటో ఎక్స్‌పోలో టయోటా ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్ తరహాలోనే ఉండబోతోంది.
అర్బన్ క్రూజర్ ఈవీ చూడటానికి చాలా మాడ్రన్ గా, పవర్‌ఫుల్ గా కనిపిస్తోంది. ఇందులో ఐబ్రో తరహా డిజైన్ కలిగిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముందు భాగంలో పియానో బ్లాక్ గ్రిల్, దృఢమైన బోనెట్ దీనికి ఎస్‌యూవీ రాజసాన్ని ఇస్తాయి. మారుతి ఈ-విటారా బాడీ షేప్‌ను పోలి ఉన్నప్పటికీ, టయోటా తన మార్క్ స్టైలింగ్, లోగోతో దీనిని మరింత ప్రీమియం కార్‌గా తీర్చిదిద్దింది.
కారు ఇంటీరియర్ గురించి కంపెనీ ఇంకా పూర్తి వివరాలు బయటపెట్టలేదు. అయితే ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉండబోతున్నాయని సమాచారం. ప్రధానంగా 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉండొచ్చు. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS వంటివి ఉండనున్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో రెండు రకాల ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఒకటి 49 kWh, రెండోది 61 kWh బ్యాటరీ ప్యాక్. పెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్లు 144 hp నుండి 174 hp వరకు పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా ఈ కారును అతి తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకోవచ్చు.
టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ , టాటా కర్వ్ ఈవీ,మారుతి ఈ-విటారా వంటి కార్లతో తలపడనుంది. టయోటాకు ఉన్న బ్రాండ్ ఇమేజ్, క్వాలిటీ నమ్మకం ఈ కారుకు మార్కెట్లో కలిసొచ్చే అంశం. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.